కోస్గి/ మద్దూరు, ఏప్రిల్ 17: దేశంలోని లంబాడీలు తమ ఆరాధ్య దైవంగా కొలిచే గురు లోకామసంద్ (బావోజీ) జాతరను రాష్ట్ర జాతరగా జరుపుకునేవిధంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని ఆబ్కారీ, పర్యాటక, క్రీడల శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నారాయణ పేట జిల్లాలోని మద్దూర్ మండలం తిమ్మారెడ్డిపల్లిలో లంబాడీల ఆరాధ్య దైవం గురు లోకామసంద్ మహరాజ్ జాతర సందర్భంగా ఆదివారం గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పట్నం నరేందర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ వనజతో కలిసి స్వామి లోకామసంద్ దర్శనం చేసుకున్నారు. రూ. 6.39 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న తిమ్మారెడ్డి పల్లి వాగు వంతెనకు, రూ.50 లక్షల వ్యయంతో బావోజీ దేవస్థాన ప్రాకారం, మండపం, ఫ్లోరింగ్ పనులకు శంకుస్థాపన చేశారు. జాతర ఏర్పాట్లకు రూ.15 లక్షలు మంజూరు చేశారు. గురు లోకామసంద్ దర్శనం అనంతరం వారు మాట్లాడారు. దాదాపు 16వ శతాబ్ధ్దంలో గురు లోకామసంద్ ఇక్కడ సజీవ సమాధి అయ్యారన్నారు. దేశంలోని లంబాడీలకు దార్శనికుడైన లోకామసంద్ జాతరకు దేశం నలుమూలల నుంచి విచ్చేస్తారని గుర్తుచేశారు.
రాబోయే రోజుల్లో సమ్మక్క,సారక్క జాతర మాదిరిగా రాష్ట్ర జాతరగా నిర్వహించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వాలు గిరిజనులకు ప్రలోభాలు పెట్టారు తప్పా ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక తండాలన్నీ గ్రామ పంచాయతీలయ్యాయన్నారు. బావోజీ జాతరలో వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా మంచినీరు, వసతి, తాత్కాలిక మరుగుదొడ్లు, విద్యుత్ తదితర ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. జాతర అయ్యాక ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రముఖులు, అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. జాతరకు, ఇక్కడి తండాలకు కావలసిన మౌలిక సదుపాయాలపై అధ్యయనం చేసి సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామన్నారు. పర్యాటక, ఇతర శాఖల అధికారుల ద్వారా భక్తులకు కాటేజీలు నిర్మించేందుకు అవకాశాలను పరిశీలిస్తామన్నారు.
గుడికి సకల సదుపాయాలు కల్పిస్తాం..
తమ ఆరాధ్య దైవం గురు లోకామసంద్ ను మొదటి సారిగా దర్శించుకునే భాగ్యం కలిగిందని గిరిజన సంక్షేమం, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సంతోషం వ్యక్తం చేశారు. ఒకప్పుడు లంబాడీ మహిళలు తాగునీటికి కిలోమీటర్ల కొద్దీ నడిచి బిందెలపై బిందెలు పెట్టుకొని నీరు మోసేవారని, రాష్ట్రం వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటింటికీ నల్లాలు, విద్యుత్తు, రహదారులు ఏర్పాటు చేసి తండాలను అభివృద్ధి చేశారని కొనియాడారు. కొడంగల్‌కు ఒక గిరిజన గురుకుల పాఠశాల మంజూరు చేసే విధంగా తనవంతు కృషి చేస్తానన్నారు.
దేశవ్యాప్తంగా భక్తులు తరలివస్తారు..
సమ్మక్క,సారక్క జాతరను గిరిజనులు జరుపుకొంటారని అదేవిధంగా లంబాడీలు లోకామసంద్ జాతర అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకొంటారని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి తెలిపారు. రాజస్థాన్, కర్ణాటక, మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా తదితర రాష్ర్టాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారన్నారు. ఇక్కడికి లక్షలాది భక్తులు వస్తారని వారికి అవసరమైన మరుగుదొడ్లు లేవన్నారు. ఉండడానికి కాటేజీలు లేక పొలాల్లో రాత్రిళ్లు గడపాల్సి వస్తుందని, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేయాలని మంత్రిని కోరారు.
గిరిజన జాతరబస్సులు లేని రోజుల్లో సైతం బావోజీ జాతరకు లక్షలాది భక్తులు వచ్చేవారని ఇప్పుడు ఇక్కడ వచ్చే భక్తుల సంఖ్య ఎన్నో రెట్లు పెరిగిపోయిందని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి అన్నారు. లంబాడీల కోసం నారాయణపేటలో సేవాలాల్ భవన్ మంజూరు చేయాలని అవసరమైన స్థలాన్ని కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రిని ఎమ్మెల్యే కోరారు. లోకామసంద్ జాతరకు గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని.. తెలంగాణ ఏర్పడిన తర్వాత సకల సదుపాయాలు కల్పించినట్లు వివరించారు.
భక్తి శ్రద్ధలతో పూజలు
లంబాడీలు అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే తమ ఆరాధ్య దైవం గురు లోకామసంద్ (బావోజీ) జాతర అత్యంత వైభవంగా జరుగుతున్నది. 16వ శతాబ్దంలో గురు లోకామసంద్ లంబాడీలకు సత్ప్రవర్తన, సామాజిక మార్పుకోసం గురుబోధనలు చేశారు. తిమ్మారెడ్డిపల్లి వద్ద లోకకల్యాణం కోసం బావోజీ సజీవ సమాధి అయి అప్పటి నుంచి లంబాడీల పూజలందుకుంటున్నారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో వచ్చే పౌర్ణమి రోజు లోకామసంద్ బావాజీ జాతర ఉంటుంది. నాలుగు రోజుల పాటు సాగే ఈ జాతర సోమవారం కాళికా దేవి పూజతో సమాప్తమవుతుంది. ఈ జాతరకు లంబాడీలు సంవత్సరంలో ఒకసారి దేశంలోని అన్ని రాష్ర్టాల నుంచి తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటారు. బావోజీ జాతరకు తరలివచ్చిన భక్తులు లోకామసంద్కు బెల్లం పానకం నైవేధ్యంగా సమర్పించారు. బావోజీకి భక్తులు మేకలు, కోళ్లను భారీగా బలి ఇచ్చారు. కార్యక్రమంలో గిరిజన సహకార సంస్థ చైర్మన్ వాల్యానాయక్, కలెక్టర్ హరిచందన దాసరి, ఎస్పీ వెంకటేశ్వర్లు, పాలమూరు యూనివర్సిటీ వీసీ లక్ష్మికాంత్ రాథోడ్, డీసీసీబీ చైర్మన్ నిజాం పాషా, స్థానిక గిరిజన నాయకుడు బాల్ సింగ్, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.