జడ్చర్లటౌన్, ఏప్రిల్ 17 : చిన్న కిరాణ దుకాణాలను టార్గెట్ చేసుకొని కొందరు నకిలీ కరెన్సీని చెలామణి చేస్తున్నట్లు తెలుస్తున్నది. జడ్చర్లలోని విజయనగర్‌కాలనీలో ఓ కిరాణ దుకాణాదారుడికి నకిలీ నోట్లు ఇచ్చిన ఘటనతో ఈ దందా వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం మేరకు.. జడ్చర్ల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని విజయనగర్‌కాలనీలో ప్రధానరహదారిపై వెంకటేశ్వర్రావు కిరాణ దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి హెల్మె ట్ ధరించి బైక్‌పై వచ్చాడు. కిరాణ దుకాణంలో ఆయిల్‌ప్యాకెట్లు ఇతరాత్ర కిరాణ సామగ్రిని కొనుగోలు చేశాడు. ఇందుకు ఏడు రూ.వంద నోట్లు ఇచ్చి వెళ్లాడు. సదరు కిరాణ వ్యాపారి ఆదివారం పాలవ్యాపారికి రూ.వంద నోట్లు ఇవ్వగా, అన్ని ఒకే సీరియ ల్ నెంబర్లతో ఉండడాన్ని గమనించి నకిలీ కరెన్సీగా గుర్తించాడు. దీంతో సదరు కిరాణ దుకాణాదారుడు అవాక్కయ్యాడు. నకిలీ కరెన్సీతో మోసపోయానని బాధితుడు లబోదిబోమన్నాడు. విషయంపై సీఐ రమేశ్‌బాబును వివరణ కోరగా, తమకెలాంటి ఫిర్యా దు అందలేదని చెప్పారు.