లింగాల, ఏప్రిల్ 17 : తెలంగాణ అమర్నాథ్ యాత్రగా ప్రసిద్ధి గాంచిన సలేశ్వరం క్షేత్రం బ్రహ్మోత్సవాలు ఆదివారం వైభవంగా ముగిశాయి. మూడు రోజులుపాటు నల్లమల ప్రాంతం లింగమయ్య నామస్మరణతో మార్మోగింది. రెండు ఏండ్ల విరామం తర్వాత సలేశ్వరం క్షేత్రంలో ఉత్సవాలు జరగడంతో రాష్ట్రం నలుమూల నుంచేగాక ఇతర రాష్ర్టాల నుంచి లక్షలాది మంది భక్తులు వేలాది వాహనాలలో తరలివచ్చి లింగమయ్య దర్శనం చేసుకొని పునీతులయ్యారు. కోరికలు తీర్చే కొంగు బంగారంగా భక్తులు లింగమయ్యను ఆరాధిస్తారు. కాగా లింగమయ్య స్వామి వద్ద చెంచులే పూజారులుగా కొనసాగడం ఆనవాయితీగా వస్తున్నది. ప్రకృతి సోయగాల మధ్య కొనసాగే ఈ యాత్రలో భక్తులు తన్మయత్వంతో పులకించిపోయారు. చైత్ర పౌర్ణమి రోజు అహ్లద భరితంగా కొనసాగే ఈ యాత్రలో ఈసారి వరుణదేవుడు భక్తులపై పగబట్టాడు. మూడు రోజులపాటు సలేశ్వరం క్షేత్రంలో భారీ వర్షాలు పడినప్పటికీ భక్తులు లింగమయ్యపై భారం వేసి యాత్రను కొనసాగించారు. కాగా అటవీ శాఖ అధికారులు ఈసారి భక్తులపై పెనుభారం మోపారు. గతంలో ఎప్పుడూలేని విధంగా వాహనాల రకాలను బట్టి టోల్ ఫీ వసూలు చేయడంతో భక్తులు తీవ్ర అసౌకర్యాన్ని గురయ్యారు. టోల్ ఫీని తొలగించాలని ఆందోళన కూడా నిర్వహించారు. కాగా టోల్ ఫీతో అటవీ శాఖకు భారీగా ఆదాయం సమకూరిందని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా గతంలో లోయలో లింగమయ్య దర్శనానికి కొబ్బరి కాయలు కొట్టడానికి రుసుమును వసూలు చేసే వారు. నేడు అలాంటి ఏదీ లేకపోవడంతో భక్తులు హర్షం వ్యక్తం చేశారు. క్షేత్రానికి తరలి వెళ్లే భక్తులకు దాతలు చేయూతనందించారు. లింగాల, ఫర్హాబాద్ మార్గాల మధ్యలో స్వచ్ఛంద సంస్థలు అల్పహారం, అన్నదానం, తాగునీరు, రాగి అంబలి అందించి తమ ఉదరత్వాన్ని చాటుకున్నారు.