మహబూబ్‌నగర్ ఏప్రిల్ 17 : కవులు, కళాకారులకు సముచితస్థానం కల్పించుకుందామని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మూడు రోజులుగా జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన శతావధానం ముగింపు కార్యక్రమానికి మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, సత్యవతిరాథోడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం హాజరై కవులను శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించారు. అవధాని డాక్టర్ అముదాల మురళి ఆధ్వర్యంలో నిర్వహించిన శతావధానం కార్యక్రమం మూడు రోజులపాటు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కవులు అనేక సందేహాలతో కూడిన సమస్యలను కవితా రూపంలో సంధించగా ఆముదాల మురళి సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ మునుముందు మరిన్ని సాహిత్య కార్యక్రమాలను నిర్వహించుకుందామని తెలిపారు. శతావధానం కార్యక్రమం విజయవంతం కావడం హర్షణీయమన్నారు. ప్రభుత్వం అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నదన్నారు. సాహిత్యానికీ మంచి రోజులు వచ్చాయని, యువకవులకు సైతం మరింత ప్రాధాన్యతను ఇస్తూ ముందుకు సాగుదామని పేర్కొన్నారు. అన్నిదిక్కులా మహబూబ్‌నగర్‌ను అభివృద్ధి చేసుకుందామని పేర్కొన్నారు. స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్ మాట్లాడుతూ కలలకు తెలంగాణ పుట్టినిల్లన్నారు. శతావధానం ముగింపు కార్యక్రమానికి హాజరుకావడం సంతోషంగా ఉందన్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మహబూబ్‌నగర్ అభివృద్ధికోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలియజేశారు. అనంతరం మంత్రి శ్రీనివాస్‌గౌడ్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డిలను శాలువ, పూలమాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మనోహర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజేశ్వర్, ఎల్లారెడ్డి, గిరిజారమణ, జగపతిరావు, నాగభూషణం ఉన్నారు.