జడ్చర్ల టౌన్, ఏప్రిల్ 14 : రాష్ట్రంలో అమలవుతున్న దళితబంధు గొప్ప సామాజిక మార్పును తీసుకొచ్చి చరిత్రలో నిలిచిపోతదని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఖానాపూర్, వల్లూరు, ఉదండాపూర్ గ్రామానికి చెందిన 30 మంది దళితబంధు లబ్ధిదారులకు ట్రాక్టర్లు, బొలెరో, జేసీబీ వాహనాలు, వరి కోత యంత్రాలను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దళితుల సాధికారత కోసమే దళితబంధు అమలు చేస్తున్నట్లు తెలిపారు. దీంతో అట్టడగున ఉన్న దళితులు సమాజంలో అందరితో పాటు బాగు పడుతారని చెప్పారు. రాబోయే రోజుల్లో అన్ని వర్గాల వారికి ఇలాంటి పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతారన్నారు. కానీ కొన్ని రాజకీయ పార్టీలు స్వార్థ రాజకీయాల కోసం కుల, మతాల మధ్య పంచాయితీలు పెడుతున్నాయని ధ్వజమెత్తారు. ప్రస్తుత రాజకీయాలను ప్రజలు గమనించాలని, ప్రజలు మంచిచేసే వారిని గుర్తించి అండగా నిలబడాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, జెడ్పీ సీఈవో జ్యోతి, మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి, తాసిల్దార్ లక్ష్మీనారాయణ, ఇన్చార్జి ఎంపీడీవో జగదీశ్, సంగీత, నాటక అకాడమీ మాజీ చైర్మన్ బాద్మి శివకుమార్, సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రణీల్చందర్, రైతుబంధు సమితి అధ్యక్షుడు కొంగళి జంగయ్య, సర్పంచులు, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.