అచ్చంపేట, ఏప్రిల్ 14 : చుట్టూ కొండా.. కోనలు.. జలపాతాలు.. ప్రకృతి రమణీయతకు అద్దంపట్టే నల్లమలలోని దట్టమైన అటవీ ప్రాంతంలో వెలిసిన లింగమయ్య దర్శనం పూర్వజన్మ సుకృతంగా భక్తులు భావిస్తారు. ఇక్కడ ఈశ్వరుడు లింగరూపంలో గృహలో దర్శనమిస్తాడు. అంతటి గొప్ప జాతర సలేశ్వరం.. తెలంగాణ అమర్నాథ్ యాత్రగా ఈ జాతరను పిలుస్తుంటారు. అంతటి ప్రాముఖ్యత ఉన్న పరమేశ్వరుని దర్శన భాగ్యానికి వేళైంది. ఈ జాతర ఉగాది తర్వాత తొలి చైత్రపౌర్ణమికి ఒక రోజు ముందు ప్రారంభమై.. ఒక రోజు వెనుక మొత్తం మూడ్రోజుల పాటు జాతర ఉంటుంది. ఈసారి ఈనెల 15 నుంచి 17వ తేదీ వరకు మూడ్రోజుల జాతర కొనసాగనున్నది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే భక్తులను అడవిలోకి అనుమతి ఇవ్వనున్నట్లు అటవీ శాఖాధికారులు తెలిపారు. భక్తుల రాక కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా కారణంగా రెండేండ్లు జాతర జరగలేదు. దీంతో ఈసారి స్వామిని దర్శించుకునేందుకు భక్తులు లక్షలాదిగా తరలిరానున్నారు.
సాహసోపేతమైన యాత్ర..
దట్టమైన అడవి మధ్య నుంచి రాళ్లు, రప్పలు,లోయలలోకి దిగి వెళ్లాల్సి ఉంటుంది. ప్రకృతి రమణీయతతో అలరారుతున్న అందమైన, చారిత్రక, ఆధ్యాత్మిక ప్రదేశం. శ్రీశైలం అడవుల్లోకి ఒక ఆదిమవాసి యాత్ర. శ్రీశైల క్షేత్రానికి 60 కి.మీ. దూరంలో ఉంటుంది. ఫరహాబాద్ మీదుగా 35 కి.మీ. ప్రమాణం చేయాల్సి ఉంటుంది. ఇందులో 30 కి.మీ. వాహన ప్రయాణం.. మిగతా 5 కి.మీ. కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది. హైవే నుంచి 10 కిలోమీటర్లు వెళ్లగానే రోడ్డు పక్కన నిజాం కాలం నాటి పురాతన కట్టడం ఉంటుంది. అక్కడి నుంచి 20 కిలోమీటర్లు వెళ్లిన తర్వాత సలేశ్వరం బేస్ క్యాంపు వస్తుంది. అక్కడే రాంపూర్ చెంచు పెంట ఉంటుంది. అక్కడే వాహనాలు నిలిపి సలేశ్వరం లోయలోని జలపాతం వద్దకు చేరుకునేంపదకు 3 కి.మీ. నడవాలి. అక్కడ రెండు ఎత్తయిన గుట్టల మధ్య నుంచి లోతైన లోయలోకి జలధార దూకుతుంది. కింద ఉన్న గుండంలోకి ఈ నీరు చేరుతంది. ఈ దారిలో ఎన్నో గుహలు, సన్నని జలధారలు కనువిందు చేస్తాయి. ఇరుకైన లోయలో జాగ్రత్తగా నడవాలి. ఒక్కో చోట బెత్తెడు దారిలో నడవాల్సి ఉంటుంది. ఏమరు పాటుగా వ్యహరిస్తే లోయలోకి పడిపోవాల్సిందే. గుండానికి సమీపంలో ఉన్న గుహలోనే లింగమయ్యస్వామి కొలువుదీరాడు. స్థానిక చెంచులే ఇక్కడ పూజారులుగా వ్యవహరిస్తారు. అక్కడే ఉన్న మరో గుహలో లింగమే ఉంటుంది. గుడి ఎదుట వీరభద్రుడు, గంగమ్మ విగ్రహాలు ఉన్నాయి.