మహబూబ్‌గర్, ఏప్రిల్10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : యాసంగి ధాన్యం కొనాల్సిందేనంటూ టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన పోరుబాటకు ఢిల్లీ వేదిక కానుంది. ఈ నెల 4నుంచి బీజేపీ ప్రభుత్వంపై ప్రారంభమైన ఉద్యమ కార్యాచరణ శుక్రవారం వరకు విజయవంతంగా కొనసాగగా… ఆదివారం ఢిల్లీలో జరిగే మహాధర్నాతో దేశమంతా చాటిచెప్పేందుకు టీఆర్ఎస్ సిద్ధమైంది. ఉమ్మడి జిల్లా నుంచి మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, ఎంపీలు మన్నె శ్రీనివాస్ రెడ్డి, పోతుగంటి రాములు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్ పర్సన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు ఢిల్లీకి తరలివెళ్లారు. చివరి క్షణంలో పలువురు నేతలు, కార్యకర్తలు రైళ్లలో ఢిల్లీకి బయలుదేరారు.
కేంద్రం తీరును దేశానికి చాటేలా..
తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయకుండా తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీరును ఎండగడుతూ వారి వైఖరిని దేశానికి చాటేలా మహాధర్నా సాగనుందని టీఆర్ఎస్ పార్టీ నేతలు తెలిపారు. యాసంగి వడ్లు కొనాల్సిందేనని డిమాండ్ చేస్తూ ధర్నా చేయనున్నారు. తెలంగాణ కేబినెట్ మొత్తం ఢిల్లీలో రైతుల కోసం ధర్నా చేయడం పట్ల సర్వత్రా ఆహ్వానిస్తున్నారు. రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఢిల్లీకి వెళ్లి నిరసన తెలపడం చరిత్రలో ఇదే తొలిసారి అవుతుందని పలువురు నేతలు వ్యాఖ్యానించారు. కేంద్రం ఆది నుంచి తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నదని, సాక్షాత్తు ప్రధాని మోదీ వైఖరి కూడా మనకు తీవ్ర వ్యతిరేకంగా ఉందని టీఆర్ఎస్ పార్టీ నేతలు చెబుతున్నారు.
కేంద్ర మంత్రే తెలంగాణ ప్రజలను నూకలు తినాలని అవమానకరంగా మాట్లాడటం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రంపై ఉన్న అభిప్రాయాన్ని సూచిస్తుందని అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఈ తరుణంలో సోమవారం నాటి మహా ధర్నాతో ఢిల్లీ మెడలు వంచేందుకు ప్రయత్నిస్తామని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన నేతలు తెలిపారు. ఆరు నూరైనా తెలంగాణ వడ్లు కేంద్రం కొనేలా వారిపై పోరాటం కొనసాగుతుందని మహబూబ్‌నగర్ టీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. ఢిల్లీ మహా దీక్షతో తెలంగాణ ప్రజల గుండె చప్పుడు దేశమంతా తెలిసేలా చేస్తామని ఆయన పేర్కొన్నారు.