మహబూబ్‌నగర్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీజేపీ నాయకురాలు డీకే అరుణపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సమైక్య రాష్ట్రంలో మంత్రిగా ఉండి తెలంగాణ రైతులను ఎండబెట్టి రాయలసీమకు నీళ్లు తీసుకుపోతుంటే మంగళ హారతులు పట్టిన విషయాన్ని గుర్తుచేశారు. నేడు మహబూబ్‌నగర్ అభివృద్ధి జరగకుండా డీకే అరుణ అడ్డుకుంటున్నారని మంత్రి దుయ్యబట్టారు. మహబూబ్‌నగర్ తెలంగాణ చౌరస్తాలో ఏర్పాటు చేసిన నిరసన దీక్షలో డీకే అరుణ తీరును మంత్రి తూర్పార బట్టారు.
భూత్పూర్ రోడ్డులో వంతెనలు నిర్మించకుండా కాంట్రాక్టర్ అయిన అరుణ భర్త డీకే భరతసింహారెడ్డి ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. అసంపూర్తి పనుల వల్ల ఎంతో మంది ప్రమాదాల బారిన పడుతున్నారన్నారు. ఎంతో కష్టపడి భారత్ మాల రోడ్డును తీసుకొస్తే మహబూబ్‌నగర్ అభివృద్ధి ఇష్టం లేని ఆ నేత కేంద్రంలో చక్రం తిప్పి పట్టణం నుంచి కాకుండా దూరంగా గుట్టల్లో నుంచి వెళ్లేలా రోడ్డును మళ్లించారని విమర్శించారు. జిల్లా అభివృద్ధి తప్ప బీజేపీ నేతల్లా తమకు కుల, మత రాజకీయాలు పట్టవన్నారు.
భారత్ మాల ఆపినా… చించోలి రోడ్డు నిర్మాణంతో పట్టణంలో వెనకబడిన బస్తీలకు మహర్దశ పట్టనుందన్నారు. గద్వాలలో అనేక అరాచకాలు చేసి ప్రశాంతంగా ఉన్న పాలమూరులో అల్లకల్లోలం చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ నేతలకు సత్తా ఉంటే పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తెస్తే వారికి దండం పెడతామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కోయిల్‌సాగర్ రోడ్డు వేయకుండా కాంట్రాక్టర్ భరతసింహారెడ్డి ఇబ్బందులు పెట్టాడని జెడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్‌రెడ్డి తెలిపారు. కోజెంట్ కంపెనీ వరకు రోడ్డు కాంట్రాక్టు దక్కించుకున్న ఆమె భర్త నేటికీ రోడ్డు వేయకుండా అక్కడి వాళ్లను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని, రాకపోకలకు అవస్థలు తప్పడంలేదని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. తుంగభద్ర నీళ్లు రాయలసీమకు తీసుకుపోతుంటే అప్పటి మంత్రి డీకే అరుణ వైఎస్ఆర్కు హారతులు పట్టిందని గద్వాలకు చెందిన టీఆర్ఎస్ నేత గట్టు తిమ్మప్ప తెలిపారు.