అలంపూర్, మార్చి 29 : అలంపూర్ క్షేత్రం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం అన్నారు. అలంపూర్‌లోని ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం ఇప్పటికే రూ.36 కోట్లు మంజూరు చేసిందని, రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు మం జూరు చేయిస్తానని చెప్పారు. మంగళవారం అలంపూర్ ఆలయ పాలక మండలి సభ్యు లు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరాజు, ఆలయ ఈవో పురేందర్ కు మార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందు వారు స్వామి, అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన శ్రీనివాస్‌రెడ్డిని అర్చకులు ఆశీర్వదించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ దీక్షాపరుడు, చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి అనుకున్న పనులు సాధిస్తాడన్నారు. పాలక మండలి ఎల్లప్పుడూ యాత్రికుల సేవలో నిమగ్నమై ఉండాలన్నారు.
ఆలయ పాలక మండలి చైర్మన్ బెక్కెం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ పదవీకాలమంతా అమ్మ సేవకే అంకితమై భక్తులకు కావాల్సిన సౌకర్యాలు, ఆలయాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఎక్స్ అఫీషియో మెంబర్, ఆలయ ముఖ్య అర్చకులు ఆనంద్ శర్మ మాట్లాడుతూ ఆలయానికి వచ్చే భక్తులకు శ్రీశైలం, మంత్రాలయం తరహాలో దర్శనం, ఉచిత ప్రసాదాలకు క్యూలైన్లోనే టోకెన్లు అందజేయాలన్నారు. విరాళాలు సేకరించి గండ్రకోట కుమారశాస్త్రి ఆలయంలో స్థాపించిన నిత్యాన్నదాన సత్రాన్ని అభివృద్ధి చేయడంతోపాటు పాలక మండలి గడువు మరో ఏడాది పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. తర్వా త ఎమ్మెల్యే, ఆలయ చైర్మన్‌ను పాలక సభ్యులు, నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మనోరమ వెంకటేశ్, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ నారాయణరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బీచుపల్లి, రమణ, పట్టణ అధ్యక్షుడు వెంకట్రామయ్యశెట్టి, మండల ఉపాధ్యక్షుడు నర్సన్‌గౌడ్, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ లక్ష్మన్న, ఎంపీటీసీలు, సర్పంచులు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.