మూసాపేట(అడ్డాకుల), మార్చి 22: తెలంగాణ ఏర్పాడక ముందు రూపొందించిన వెంచర్లకు టీఆర్ఎస్ పార్టీకి సంబంధం ఉందంటూ నిరాధారమైన ఆరోపణలు చేస్తే సహించేది లేదని రాచాల యుగేంధర్గౌడ్ను అడ్డాకుల టీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. అడ్డాకులలో మంగళవారం సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు జయన్నగౌడ్, కందూరు సర్పంచ్ శ్రీకాంత్, ఉద్యమకారుడు, అడ్డాకుల మాజీ ఎంపీటీసీ భీమన్నయాదవ్ టీఆర్ఎస్ నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘అక్రమ వెంచర్లకు అడ్డాకుల నిలయం’ అంటూ అవగాహన లేకుండా యుగేంధర్‌గౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే, జెడ్పీటీసీకి సంబంధం ఉందని ఆరోపణ చేయడం అతని అవివేకానికి నిదర్శనమన్నారు. అడ్డాకుల మండలానికి జెడ్పీటీసీ నల్లమద్ది రాజశేఖర్‌రెడ్డి ఆపద్బాంధవుడిగా నిలుస్తున్నారన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తోచిన సాయం చేస్తూ ఆదకుంటున్న వ్యక్తిని విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీపీ దోనూరు నాగార్జునరెడ్డి, ఎంపీటీసీల సంఘం మండలాధ్యక్షుడు రంగన్నగౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, రైతుబంధు మండలాధ్యక్షుడు బి.తిరుపతిరెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ జితేందర్‌రెడ్డి, ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.