మహబూబ్‌నగర్, మార్చి 22 : మహబూబ్‌నగర్ జిల్లాలో చేపడుతున్న అభివృద్ధిని చూసి కొందరి కండ్లు మండుతున్నాయని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మౌలాలి గుట్ట వద్ద రూ.53.90 లక్షలతో ఏర్పాటు చేసిన జంతు జనన నియంత్రణ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఎఫ్ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణ పనులను పరిశీలించారు. అభివృద్ధి పనుల్లో అలసత్వం వహించకుండా పక్కాగా పనులు చేయాలని ఆదేశించారు. అనంతరం మినీట్యాంక్‌బండ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సహకారంతో మరింత అభివృద్ధి చేస్తామన్నారు. సొంత ఇల్లు మాదిరిగా కేవలం మూడు నెలల్లో నాణ్యవంతంగా పనులు పూర్తి చేయాలని సూచిచారు. మహబూబ్‌నగర్‌ను ఎవరూ విచ్ఛిన్నం చేయలేరన్నారు. మినీట్యాంక్‌బండ్ పక్కనే రూ.13 కోట్లతో మినీ శిల్పరామం, రూ.14 కోట్లతో వాకింగ్ ట్రాక్, పెద్దచెరువు చుట్టూ నెక్లెస్ రోడ్డుతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు.
మినీ ట్యాంక్‌బండ్ చుట్టూ ఉన్న ఇండ్లకు రోడ్డు కనిక్టివిటీ ఏర్పాటు చేస్తామన్నారు. ఐలాండ్‌కు సస్పెషన్ బ్రిడ్జి నిర్మిస్తామన్నారు. ఈ ప్రాంతాన్ని మరింత రిచ్‌గా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. హిందూ, ముస్లింల మధ్య కొట్లాట పెట్టాలని చూస్తున్నారని, వారి ఆటలు ఇక్కడ సాగావన్నారు. చిన్న అలజడి సృష్టించి కులాలు, మతాల పేరుతో రాజకీయాలు చేస్తున్నారని, ఇది సరైన విధానం కాదన్నారు. మినీట్యాంక్‌బండ్ చెరువును కృష్ణానీటితో నింపేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రావు, అదనపు కలెక్టర్ తేజస్‌నందలాల్‌పవర్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, వైస్ చైర్మన్ గణేశ్, కమిషనర్ ప్రదీప్‌కుమార్, డీఈ సుబ్రహ్మణ్యం, కౌన్సిలర్ కిశోర్, నాయకుడు వెంకటేశ్ తదితరులు ఉన్నారు.
ఇదిలా ఉండగా, జిల్లా కేంద్రంలోని అభివృద్ధి కార్యక్రమాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన మల్లేశ్‌ను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కాన్వాయ్‌ను ఆపి పరామర్శించారు. అనంతరం మల్లేశ్‌ను దగ్గరుండి ఆటోలో దవాఖానకు తరలించారు.