మహబూబ్‌నగర్, మార్చి 21(నమస్తే తెలంగాణ ప్రతినిధి): మహబూబ్‌నగర్ జిల్లాలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు ముందుగా చిన్న చిన్న ఉత్పత్తులు తయారు చేశారు. అనంతరం తినుబండారాలు, మిల్లెట్స్, చేతి వృత్తుల తయారీ వంటి 58 రకాల వస్తువులను తయారు చేయడం మొదలుపెట్టారు. వీరు తయారు చేసిన ఉత్పత్తులకు మహా బ్రాండ్ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో మార్కెటింగ్ తో పాటు, ఆన్లైన్ అమ్మకాలు కూడా ప్రారంభించారు. మహిళా సంఘాల సభ్యులకు ఆర్థిక స్వావలంబన కలగటమే కాకుండా వారి జీవనోపాధులు మెరుగుపడ్డాయి. దీనికి సంబంధించిన వివరాలను స్కోచ్ ఇండియా లిమిటెడ్ కు సమర్పించారు జిల్లా అధికారులు. క్షుణ్ణంగా పరిశీలించి, అధ్యయనం చేసిన తర్వాత అవార్డుల జ్యూరీ..ప్రతిష్ఠాత్మక స్కోచ్ అవార్డుకు మహా బ్రాండ్‌ను ఎంపిక చేసింది.
చెక్ డ్యాంలతో పెరిగిన భూగర్భ జలాలు..
చిన్న నీటి పారుదల శాఖ ద్వారా చెక్ డ్యాంల నిర్మాణాన్ని చేపట్టడం ద్వారా నీటి నిలువ సామర్థ్యం పెరిగింది. జిల్లాలో భూగర్భ జలాలు పెరిగాయి. ఏకంగా 12 మీటర్ల నుంచి 6 మీటర్ల మేరకు భూగర్భ జలాలు ఉబికి వచ్చాయి. దీంతో నీటి పారుదల సౌకర్యం పెరిగడంతో పాటు సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. చెక్ డ్యాంలతోనే సాగునీటి రంగాన్ని బలోపేతం చేసినందుకు జిల్లాకు మరో స్కోచ్ అవార్డ్ దక్కింది. మహబూబ్‌నగర్ జిల్లాలో రూ.160.44కోట్లతో 27చెక్‌డ్యాంలు నిర్మించగా, 10,128 ఎకరాల ఆయకట్టు ఏర్పడింది. బోర్లు పెద్ద ఎత్తున రీచార్జ్ అయ్యాయి.
జిల్లా యంత్రాంగానికి అభినందనలు
మహిళల ఆర్థిక స్వావలంబనకు గుర్తింపుగా మహా బ్రాండ్, భూగర్భ జలాలు పెంపునకు రెండు స్కోచ్ అవార్డులు రావడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. ఇక భూగర్భ జలాలు పెరిగేలా ప్రణాళికతో చెక్ డ్యాంలు నిర్మించేందుకు ప్రభుత్వం అడిగిన మేరకు నిధులు విడుదల చేసింది. పెద్ద ఎత్తున చెక్ డ్యాంలు నిర్మించడం వల్ల నీటి వృథా లేకుండా నిల్వ ఉండి భూగర్భ జలాలు భారీగా పెరిగాయి. అన్నదాతల బోర్లు, బాగా రీచార్జ్ అయ్యాయి. బావుల్లో నీళ్లు పైపైకి వచ్చాయి. జిల్లాకు రెండు స్కోచ్ అవార్డులు రావడంపై జిల్లా యంత్రాంగానికి కలెక్టర్ ఎస్. వెంకట్రావు, అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, డీఆర్డీవో యాదయ్య, ఇరిగేషన్ ఎస్ఈ నరసింగరావు, ఎన్ఐసీ అధికారి సత్యనారాయణమూర్తికి ప్రత్యేక శుభాకాంక్షలు.
– వి.శ్రీనివాస్ గౌడ్, ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, సాంస్కృతిక శాఖ మంత్రి
సాగునీటి రంగంలో రావడం గొప్ప విషయం..
పరిపాలన పరంగా, వివిధ అభివృద్ధి పథకాలకు సంబంధించి చక్కని పనితీరు చూపించే జిల్లాలకు, ప్రభుత్వ విభాగాలకు స్కోచ్ అవార్డులు వస్తుంటాయి. అయితే సాగునీటి రంగంలో మహబూబ్‌నగర్ జిల్లాకు స్కోచ్ అవార్డు రావడం ఎంతో సంతోషాన్నిస్తున్నది. భూగర్భ జలాలు 12మీటర్ల లోతు నుంచి 6మీటర్ల స్థాయిలోకి వచ్చేలా చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇక మహిళా సంఘాల విజయ గాథకు మహా బ్రాండ్ నిలువెత్తు నిదర్శనం. మహా బ్రాండ్ కూడా స్కోచ్ అవార్డు కైవసం చేసుకుని జాతీయ స్థాయిలో గుర్తింపునకు నోచుకున్నది.
– ఎస్. వెంకట్రావు, కలెక్టర్, మహబూబ్‌నగర్