వనపర్తిలో రిజిస్ట్రేషన్ల జోరు
రాష్ట్రంలో మొదటి స్థానంలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం
సాగు నీటి రాకతో భూములకు పెరిగిన డిమాండ్
ప్రతి నెలా రూ.కోట్లల్లో ఆదాయం
పరోక్షంగా రియల్ వ్యాపారాలు చేస్తున్న 10వేల మంది..
వనపర్తి, మార్చి 20: వనపర్తి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఆదాయంలో టాప్‌లో నిలిచింది. రోజుకు 60 నుంచి 90 వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. దీంతో రాష్ట్రంలోనే నెంబర్‌వన్ స్థానంలో నిలిచింది. సీఎం కేసీఆర్ హయాంలో సాగునీరు పుష్కలంగా కావడంతో భూములకు రెక్కలొచ్చాయి. వ్యవసాయేతర, వ్యవసాయ భూములతోపాటు ప్లాట్ల రిజిస్ట్రేషన్లు జోరందుకున్నాయి. దీంతో ప్రతి నెలలో రూ.కోట్లల్లో రెవెన్యూ సమకూరుతున్నది. ఈ కార్యాలయ పరిధిలో పరోక్షంగా10 వేల మంది రియల్ వ్యాపారాలు కొనసాగిస్తూ ఉపాధి పొందుతున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో అత్యధిక రిజిస్ట్రేషన్లు జరిగే సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో వనపర్తి సబ్ రిజిస్టర్ కార్యాలయం 3వ స్థానంలో (2009 సంవత్సరం నుండి 2014 సంవత్సరం వరకు ) గతంలో ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అత్యధిక రిజిస్ట్రేషన్లు అయ్యే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రోజుకు 60 నుంచి 90 మధ్యలో రిజిస్ట్రేషన్లు జరుగుతూ రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది.
సాగునీటి రాకతో భూములకు రెక్కలు
వనపర్తి సబ్ రిజిస్ట్రార్ పరిధిలో 2016 వరకు రూ.లక్ష నుంచి 3లక్షల వరకు ఎకరా భూమి లభించేంది. నియోజకవర్గ పరిధిలో చెరువులను పునరుద్ధరించడంతో పుష్కలంగా సాగునీరు ఉండడంతో వలసల నుంచి తిరిగి వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నారు. ప్రసుత్తం వనపర్తి జిల్లా కేంద్రానికి నలువైపులా దాదాపు 10 కిలోమీటర్ల ఎకరా కోట్ల రూపాయలు పలుకడం విశేషం.
జిల్లా ఏర్పాటుతో ..
వనపర్తి పట్టణంగా ఉన్న సమయంలో పట్టణంలో 4లక్షల నుంచి రూ.6లక్షల, శివారు ప్రాంతంలో లక్ష నుంచి రూ.2.50లక్షలకు ప్లాట్లు (133 గజాలు) లభించేవి. మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రత్యేక చొరవతో పట్టణం జిల్లా కేంద్రం ఏర్పడడంతో ప్లాట్ల రేట్లు అమాంతం పెరిగాయి. కొత్తకోట రోడ్డు రాజపేట గ్రామ శివారులో టీఆర్ఎస్, షాదీఖానా ఏర్పాటు కాకముందు ప్లాటు ధర రూ.60వేలు కాగా ప్రసుత్తం రూ.7 నుంచి రూ.8లక్షలు పలుకుతుంది. మర్రికుంటలో రూ.4లక్షలు ఉండగా ప్రసుత్తం సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ సముదాయాల రాకతో రూ.20లక్షలు పెట్టినా ప్లాట్లు దొరికే పరిస్థితి లేదని రియల్ వ్యాపారులు తెలిపారు.
10వేల మంది రియల్ వ్యాపారాలు..
వనపర్తి సబ్ రిజిస్ట్రార్ పరిధి వనపర్తి, ఖిల్లాఘనపురం, గోపాల్పేట, కొత్తకోట, పెబ్బేర్, పెద్దమందడి, పాన్‌గల్, వీపనగండ్ల, చిన్నంబావి, రేవల్లి మండలాల్లో కలిపి దాదాపు ప్లాట్ల విక్రయాలకు, రియల్ వ్యాపారంలో పరోక్షంగా 10వేల మంది కుటుంబాలు ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తున్నట్లు సమాచారం. జిల్లా ఏర్పడక ముందు వనపర్తి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో 15 దుకాణాలు ఉండగా అందులో ఒక్కో షాపులో ముగ్గురు పని చేసేవారు. ప్రస్తుతం 35డాక్యుమెంట్ రైటర్స్ ఆఫీసులు ఉండగా, ప్రతి షాపులో 5మంది పని చేస్తున్నారు.
పారదర్శకంగా సేవలు
వనపర్తి పట్టణం అభివృద్ధిలో ముందు వరుసలో వేగంగా విస్తరిస్తున్నది. అదే స్థాయిలో రిజిస్ట్రేషన్లు, భూముల ధరలు పెరిగాయి. రికార్డు స్థాయిలో రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. ప్రజలకు పారదర్శకమైన సేవలను అందిస్తున్నాం. రిజిస్ట్రేషన్ అయిన వెంటనే డ్యాంకుమెంట్లను అందజేస్తున్నాం. ప్రతి రోజు 60 నుంచి 80మధ్యలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.
– క్రిస్టఫర్, సబ్ రిజిస్ట్రార్, వనపర్తి