మహబూబ్‌నగర్, మార్చి 1: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం శివాలయాల్లో భక్తుల శివనామస్మరణ మార్మోగింది. జిల్లావ్యాప్తంగా ఆలయాల్లో తెల్లవారుజాము నుంచి శివుడికి ప్రత్యేక పూజలు చేసి ఉపవాస దీక్షలు చేపట్టారు. జిల్లాకేంద్రంలోని పెద్ద శివాలయంతోపాటు మోన్నప్పగుట్ట మౌనేశ్వరస్వామి ఆలయం, అయ్యప్పకొండపై కొలువుదీరిన శివమార్కండేయస్వామి ఆలయంలో గణపతిపూజ, పంచామృతాభిషేకం, రుద్రాభిషేకం, అలంకరణ, విశేష అభిషేకం, రాత్రి లింగోద్భవకాలంలో రుద్రాభిషేకం, శివపార్వతుల కల్యాణం నిర్వహించారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షుడు ప్రభాకర్‌రావు, శంకర్, అనంతరాములు, బాసర రామస్వామి, వెంకటేశ్, భీంపల్లి శ్రీకాంత్, సుకుమార్, భక్తులు పాల్గొన్నారు.
జనసంద్రం.. మన్యంకొండ
మన్యంకొండ ఆలయానికి మహాశివరాత్రి, అమావాస్య సందర్భంగా మంగళవారం భక్తులు భారీగా తరలొచ్చారు. లక్ష్మీవేంకటేశ్వరుడి దర్శనానికి గంట సమయం వేచి ఉండి దర్శనం చేసుకున్నారు. ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నామని ఆలయ చైర్మన్, ధర్మకర్త అలహరి మధుసూదన్‌కుమార్ సూచించారు.
కందూరు రామలింగేశ్వరస్వామి ఆలయంలో..
మండలంలోని కందూ రు రామలింగేశ్వరస్వామికి దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఆయన సతీమణి ఆల మంజుల అభిషేకం, పూజలు చేశారు. మంగళవారం మహాశివరాత్రి సందర్భంగా స్వామివారిని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు దర్శించుకొని పూజులు చేశారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా అడ్డాకుల మండలకేంద్రంతోపాటు, ఆయా గ్రామాల్లో ప్రజలు పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. మూసాపేటలోని రామస్వామి గుట్టపై ఉన్న శివాలయంతో పాటు, పోల్కంపల్లిలోని శారద చంద్రమౌళీశ్వరస్వామి ఆలయంలో భక్తులకు ప్రత్యేక పూజలు చేశారు.
చిన్నచింతకుంట మండలంలో..
మండలంలోని చిన్న వడ్డెమాన్ శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అర్చకులు, భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుంచి మండలంలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
బాలానగర్ మండలంలో..
మండలంలోని శైవక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగాయి. మంగళవారం మహా శివరాత్రి సందర్భంగా మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లో భక్తులు శివలింగానికి ప్రత్యేక పూజలు చేశారు. నందారం శివాలయంలో శివపార్వతుల కల్యాణం జరిపించారు. అదేవిధంగా భక్తులకు అన్నదానం చేశారు.
నంచర్ల శివాలయంలో ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మంగళవారం నంచర్ల శివాలయంలో పరిగి ఎమ్మె ల్యే మహేశ్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ప్రతిఒక్కరూ భక్తిభావం పెంచుకోవాలన్నారు. ఎమ్మెల్యే వెంట జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు భిక్షపతి, నాయకులు గోపాల్‌రెడ్డి, కిష్టయ్య, తిర్మల్‌రెడ్డి పాల్గొన్నారు.
రాజాపూర్ మండలంలో..
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం మండలంలో భక్తులు శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. తిర్మలాపూర్ మల్లికార్జునస్వామి ఆలయంలో డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి పూజలు చేశారు. వేదపండితులు నర్సింహమూర్తి, రాంమూర్తి ఆధ్వర్యంలో ఏకదశ రుద్రాభిషేకం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ మహేశ్వరి, రఘునందన్‌రెడ్డి, నర్సింహులుగౌడ్, గోవర్ధన్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, దశరథరెడ్డి, శ్రీనివాస్, బాలయ్య, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇప్పటూర్‌లో శివపార్వతుల కల్యాణం
మండలకేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లో మంగళవారం మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఫతేపూర్ మైసమ్మ ఆలయం, నవాబ్‌పేట, గురుకుంట ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఇప్పటూర్ శివాంజనేయస్వామి ఆలయంలో శివపార్వతుల కల్యాణం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో సింగిల్‌విండో వైస్‌చైర్మన్ భూపాల్‌రెడ్డి, సర్పంచ్ గౌసియాఅబ్దుల్లా, ఉపసర్పంచ్ రవికిరణ్, ఎంపీటీసీ లక్ష్మీబాయి, నాయకులు అబ్దుల్లా, నవనీతరావు, సూర్యప్రకాశ్‌రావు, ప్రకాశ్, స్వామి వీరనారాయణాచారి, నర్సింహారెడ్డి పాల్గొన్నారు.
మిడ్జిల్ మండలంలో..
మహాశివరాత్రి సందర్భంగా మంగళవారం శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. మండలంలోని ఆయా గ్రామాల్లో శివుడికి అభిషేకం, శివపార్వతుల కల్యాణోత్సవం, యజ్ఞం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. రాత్రి అఖండ భజనలు, భక్తులు ఉపవాస దీక్షలు, అభిషేకాలు, పూజలు, హోమాలు, వ్రతాలు, జాగరణ చేశారు. ప్రతి ఇంటివద్ద భక్తి పారవశ్యం కనబడింది. భక్తులు కుటుంబసభ్యులతో కలిసి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి పరమశివుడికి మొక్కులు చెల్లించుకున్నారు. శైవక్షేత్రాలు హరిహర మహాదేవ శంభోశంకర నామస్మరణతో మార్మోగాయి.