మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 21: ప్రజలు పలు సమస్యలతో సతమతమవుతూ అధికారుల దృష్టికి తీసుకొచ్చిన ప్రతి ఫిర్యాదును వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఎస్ వెంకట్రావు అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ఫిర్యాదులను స్వీకరించి మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా 222 ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. జిల్లా అధికారులతో 48, తాసిల్దార్ స్థాయిలో 74పెండింగ్‌లో ఉన్నాయన్నారు. మార్చి 1 నుంచి 7వ తేదీ వరకు ఫైళ్ల డిస్పోజల్ వారంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సోమవారం 92 ఫిర్యాదులు రాగా, వాటిలో ఎక్కువగా భూములకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నట్లు వివరించారు.
మహా బ్రాండ్ ఉత్పత్తులకు ప్రాధాన్యత
స్వయం సహాయక మహిళా సంఘాలు మహాబ్రాండ్ పేరు తో తయారుచేస్తున్న ఉత్పత్తులను పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్లడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంటున్నదని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. సోమవారం కలెక్టరేట్లో గండీడ్ మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యం లో తయారుచేస్తున్న మిల్లెట్ ఉత్పత్తుల యూనిట్ సంచార వాహనాన్ని కలెక్టర్ మహిళా సంఘం సభ్యులతో కలిసి ప్రారంభించారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సూచన మేరకు సంచార వాహనాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.
చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలి
చిన్నారులను అంగవైకల్యం నుంచి విముక్తి కల్పించేందుకు తల్లిదండ్రులు పల్స్‌పోలియో చుక్కలను వేయించాలని కలెక్టర్ ఎస్ వెంకట్రావు అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశ మందిరంలో ఈ నెల 27న వేయనున్న పల్స్‌పోలియో కార్యక్రమం ప్రచార పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. 676 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, 698 వ్యాక్సిన్ వాయిల్స్ జిల్లాకు వచ్చాయని, జిల్లాను 68రూట్లుగా విభజించి 68మంది పర్యవేక్షకులను నియమించినట్లు తెలిపారు. 2,824 మంది వ్యాక్సినేటర్లు, 203మంది ఏఎన్ఎం, 689మంది వలంటీర్ల సేవలను వినియోగించుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. మండల అధికారులు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి పూర్తిస్థాయిలో పోలియో చుక్కలకు ఆర్హులైన చిన్నారులందరికీ చేరేలా చూడాలని ఆదేశించారు. 27న వేయని పిల్లలకు 28న, మార్చి 1న ఇంటింటికీ తిరిగి పల్స్‌పోలియో చుక్కలు వేయాలని ఈ సందర్భంగా తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ సీతారామారావు, ఆర్డీవో పద్మశ్రీ, జెడ్పీసీఈవో జ్యోతి, డీఆర్డీవో యాదయ్య, డీపీ ఎం అనిల్, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సురేఖ, ఏపీఎం సుదర్శన్, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ శశికాంత్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ శంకర్, ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రామ్మోహన్, డాక్టర్ రఫీ, డెమో తిరుపతిరావు, డాక్టర్ సృజన తదితరులు పాల్గొన్నారు.