మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 21(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ ఏర్పాటుకు ముందు సంక్షేమ వసతి గృహాల్లో దొడ్డు బియ్యం, పురుగుల అన్నంతో భోజనం చేయలేక విద్యార్థులు ఎంతో అవస్థలు పడేవారు. కొందరు విద్యార్థులు ఉపవాసంతో పాఠశాలకు వెళ్లేవారు. రాష్ట్రం ఏర్పడ్డాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అన్ని పాఠశాలల్లో సన్న బియ్యంతో మధ్యాహ్న భోజన పథకం వచ్చేసింది. సంక్షేమ వసతి గృహాల్లోనూ నాణ్యమైన భోజనం అందుబాటులోకి వచ్చింది. మహబూబ్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని పాఠశాలల్లో చాలా మంది విద్యార్థులు టిఫిన్ చేయకుండానే బడికి వస్తున్న విషయాన్ని ప్రత్యక్షంగా గమనించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అరబిందో ఫార్మా ఫౌండేషన్, హరేకృష్ణ మూమెంట్ సహకారంతో స్వాస్థ్య ఆహారం పేరిట అల్పాహారం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. సోమవారం నుంచి మహబూబ్‌నగర్ పట్టణంలో విద్యార్థులకు అల్పాహారాన్ని అందించారు. బడిలోనే టిఫిన్ పెడుతుండడంతో ఖాళీ కడుపుతో ఇక బడికి రావాల్సిన పరిస్థితి లేదని విద్యార్థులు సంతోషపడుతున్నారు.
ఆకలి బాధ తీరింది..
టిఫిన్ చేయకుండా స్కూల్‌కు రావడంతో బలహీనంగా ఉన్నట్లు అనిపించేది. ఆకలి కారణంగా క్లాసులు సరిగా వినే పరిస్థితి ఉండేది కాదు. కొన్నిసార్లు టిఫిన్ చేసి వచ్చేందుకు ఆలస్యమయ్యేది. ఇప్పుడు బడిలోనే టిఫిన్ పెడుతుండడంతో ఆ సమస్య తీరింది. మొదటి రోజు ఇడ్లీ ఇచ్చారు. టిఫిన్ చాలా బాగుంది.
– కె.మహేశ్వరి, 9వ తరగతి, వీరన్నపేట జెడ్పీహెచ్ఎస్
హాజరు శాతం పెరుగుతుంది..
మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మూడేండ్లుగా ప్రయత్నించి అరబిందో ఫార్మా ఫౌండేషన్ వితరణతో హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సెంట్రలైజ్డ్ కిచెన్‌ను ప్రారంభించారు. దీంతో సర్కారు బడి పిల్లలకు అల్పాహారం అందించే అవకాశం ఏర్పడింది. ఈ కార్యక్రమంతో పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెరిగేందుకు దోహదపడుతుంది. మహబూబ్‌నగర్‌లో సోమవారం నుంచి ప్రారంభించడం చాలా సంతోషంగా ఉన్నది. విద్యార్థులు చాలా ఆనందంగా టిఫిన్ చేశారు.
– కొరమోని నర్సింహులు, మున్సిపల్ చైర్మన్, మహబూబ్‌నగర్
మంత్రికి కృతజ్ఞతలు..
వీరన్నపేటలో చాలా మంది పేదలు నివసిస్తారు. చిన్నచిన్న పనులు చేసుకుని జీవించేవాళ్లు. అందుకే ఉదయమే పనులకు వెళ్తుంటారు. దీంతో వారి పిల్లలు టిఫిన్ చేయకుండానే బడికి వస్తారు. వీరంతా ఆకలితోనే పాఠాలు వినాల్సి వస్తుంది. హరేకృష్ణ ఫౌండేషన్ ద్వారా మా బడి పిల్లలకు అల్పాహారం అందిస్తున్నందుకు చాలా మంది పిల్లలకు మేలు జరుగుతుంది. ఈ అవకాశం కల్పించినందుకు మంత్రికి, హరేకృష్ణ ఫౌండేషన్, అరబిందో ఫార్మా ఫౌండేషన్ వాళ్లకు కృతజ్ఞతలు.
– అంజద్ అలీ అజహర్, హెచ్ఎం, ఉర్దూ మీడియం హైస్కూల్, వీరన్నపేట