మహబూబ్నగర్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ తిరుప తి, కలియుగ వైకుంఠం, కొలిచిన వారికి కొంగు బంగారమై విరాజిల్లుతున్న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని మన్యంకొండ దేవస్థానం బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మన్యంకొండ వెంకన్నను మొక్కితే తిరుపతికి వెళ్లిన ఫలం దక్కుతుందని భక్తుల నమ్మకం. తవ్వని కోనేరు, చెక్కని పాదాలు, ఉలి ముట్టని విగ్రహంతో ప్రసిద్ధి గాంచిన మన్యంకొండ బ్రహ్మోత్సవాలకు భక్తులు భారీగా తరలి వస్తారు. మార్చి 21వ తేదీ వరకు ఉత్సవాలు జరుగనున్నాయి. శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏటా మాఘ శుద్ధ పౌర్ణమి రోజున ప్రధాన ఘట్టమైన గరుఢవాహన సేవ, రథోత్సవం నిర్వహిస్తారు. అంగరంగ వైభవంగా జరిగే రథోత్సవానికి సుమారు లక్ష మందికి పైగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నది. బ్రహ్మోత్స వాల్లో భాగంగా ఈ నెల 11వ తేదీన తిరుచ్చి సేవ, 12న గజవాహన సేవ, 13న హంస వాహన సేవ, 14న సూర్యప్రభ వాహన సేవ, 15న ప్రభోత్సవం, 16న గరుఢ వాహన సేవ, రథోత్సవం, 17న స్వామి వారి దర్బారు సేవ కార్యక్రమాలు ఉంటాయి. కాగా, మార్చి 16 నుంచి 20వ తేదీ వరకు అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. అం కురార్పణ, ధ్వజారోహణం, దేవతాహ్వానం, అశ్వవాహన సేవ, పూర్ణాహుతి, వసంతోత్సవం, మార్చి 18న అమ్మవారి తిరు కల్యాణోత్సవం, గరుఢ వాహన సేవ ఉంటాయి.
భారీగా తరలిరానున్న భక్తులు..
కొవిడ్ మహమ్మారి కారణంగా గతేడాది బ్రహ్మోత్సవాలకు సుమారు 4 లక్షల వరకు భక్తులు హాజరయ్యారు. ఈ సారి గతేడాదికి మించి రానున్నట్లు ఆలయకమిటీ అంచ నా. రాష్ట్రంలో కరోనా మహమ్మారి తగ్గుతున్నందున భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అ వకాశం కనిపిస్తున్నది. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు ఆలయ కమిటీ చైర్మన్ అలహరి మధుసూదన్ తెలిపారు.