మహబూబ్‌నగర్‌టౌన్, ఫిబ్రవరి 4 : మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను వసూలుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. వందశాతం ఆస్తిపన్ను వసూలు చేయడమే లక్ష్యంగా ప్రణాళిక సిద్ధం చేశారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికిగానూ మహబూబ్‌నగర్, బాదేపల్లి, భూత్పూర్ బల్దియాల్లో ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఆటోలతో విస్తృత ప్రచారం నిర్వహించడంతోపాటు ప్రధానరహదారి వెంట బ్యానర్లను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే, మొండి బకాయిదారుల జాబితాను తయారు చేసి సెల్ఫోన్లకు మెసేజ్‌లు పంపిస్తున్నా రు. ఆస్తిపన్ను చెల్లించని వారికి రెడ్ నోటీసులు జారీ చేయడంతోపాటు మున్సిపల్ వెబ్సైట్లో నమోదు చేస్తున్నారు. అధిక మొత్తంలో బకాయి ఉన్న యజమానులను కమిషన ర్లు, అధికారులు స్వయంగా కలిసి ఆస్తిపన్ను వసూలుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా వందశాతం ఆస్తిపన్ను వసూలే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు.
అధికారులకు టార్గెట్..
మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను వసూలుకు సంబంధించి అధికారులకు టార్గెట్లు విధించారు. బిల్ కలెక్టర్లు 85శాతం, సూపర్వైజర్లు 10శాతం, మున్సిపల్ కమిషనర్లు 5శాతం ఆస్తిపన్ను వసూలు చేసేలా ప్రణాళిక రూపొందించుకోవాలని సీడీఎంఏ నుంచి ఆదేశాలు వచ్చాయి. అలాగే మున్సిపాలిటీల్లో ఆస్తుపన్నుకు సంబంధించిన బకాయిదారుల వివరాలను కలెక్టర్‌కు తెలియజేయాలని సూచించారు. ఈ మేరకు మున్సిపల్ అధికారులు ఆస్తిపన్ను వసూలుపై ప్రత్యేక దృష్టి సారించారు. బకాయిదారుల జాబితాను మున్సిపల్ వెబ్సైట్, నోటీస్ బోర్డుల్లో ఏర్పాటు చేయనున్నారు. ఆస్తిపన్నుకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడం, సందేహాల నివృత్తికి ప్రతి సోమ, బుధవారాల్లో మున్సిపల్ కార్యాలయాలు, కమ్యూనిటీహాళ్లల్లో ట్యాక్స్, రీడ్రైస్సల్ మేళాలు ఏర్పాటు చేయనున్నారు.
ప్రత్యేక బృందాలు ఏర్పాటు
ఆస్తిపన్ను వసూలుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. మార్చి 31వ తేదీలోగా ఆస్తిపన్ను వందశాతం వసూలు చేస్తాం. రోజూ రూ.లక్షవరకు ఆస్తిపన్ను వసూలు చేయాలని బిల్ కలెక్టర్లు, అధికారులకు సూచించాం. బకాయిదారుల వివరాలన్నీ వెబ్సైట్లో పొందుపర్చాం. ఆస్తిపన్ను చెల్లించని వారికి నోటీసులు పంపుతున్నాం. సకాలంలో ఆస్తిపన్ను చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలి.
– ప్రదీప్‌కుమార్, కమిషనర్, మహబూబ్‌నగర్