
గట్టు, జనవరి 23 : గట్టు(నలసోమనాద్రి) ఎత్తిపోతల పథకానికి టెండర్ల పిలుపుతో గట్టు, కేటీదొడ్డి రైతుల్లో ఆశలు గట్టి పడుతున్నాయి. రూ.328.74కోట్ల వ్యయంతో ఎత్తిపోతల పనులకు టెండర్ నోటీస్ను 17న విడుదల చేశారు. 21నుంచి నుంచి 25వరకు టెండర్ ఫారాలు పొందడానికి అవకాశం ఇచ్చారు. ఇదే తేదీల్లోనే టెండర్ ఫారాలను స్వీకరించనున్నారు. వచ్చే నెల 5న టెక్నికల్ బిడ్ను, 10న ప్రైజ్ బిడ్ను ఓపెన్ చేయనున్నారు. ఇదిలా ఉండగా.. నెట్టెంపాడు ఎత్తిపోతలకు సంబంధించి మండలంలో ర్యాలంపాడు, తాటికుంట, చిన్నోనిపల్లి, ముచ్చోనిపల్లి రిజర్వాయర్లు ఉన్నా గట్టు, కేటీదొడ్డి మండలాలకు ఒరిగిందేమిలేదనే అపవాదు ఈ ఎత్తిపోతలతో తొలగనున్నది. గట్టు మండలం మల్లాపురంతండా సమీపంలోని గజ్జలమ్మ గట్టు ప్రాంతంలోని గుట్టల సమీపంలో 1.32 టీఎంసీల నీటి సామర్థ్యంతో నిర్మించనున్నారు. 33వేల ఎకరాలకు సాగనీరు అందనున్నది. నిర్మాణం కోసం 950ఎకరాల భూసేకరణ చేయనున్నారు.
‘గట్టు’ కల నెరవేరబోతున్నది
గట్టు, కేటీదొడ్డి రైతుల చిరకాల వాంఛ గట్టు ఎత్తిపోతల పథకం నెరవేరబోతున్నందుకు ఆనందంగా ఉన్నది. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు రెండు మండలాల రైతులతోపాటు నేను కృతజ్ఞుతుడిని. ఈ ఎత్తిపోతలకు టెండర్లను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. టెండర్ ఖరారైన వెంటనే పనులను ప్రారంభిస్తారు. ఏడాది నుంచి ఏడాదిన్నరలోపు నిర్మాణపు పనులన్నీ పూర్తవుతాయని భావిస్తున్నాను. రాబోయే ఎన్నికల్లోపు ఈ ఎత్తిపోతల ద్వారా గట్టు, కేటీదొడ్డి మండలాల్లోని బీడు భూములకు సాగునీటిని అందించి తీరుతా.
పచ్చదనాన్ని చూడాలని ఉంది
గట్టు ఎత్తిపోతల పథకం ఏండ్ల నుంచి నానుతూ ఉన్నది. ఈ పథకాన్ని ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. గట్టు ఎత్తిపోతల పథకంపై మా ఆశలు చిగురిస్తున్నాయి. నిర్మాణానికి అడుగులు పడుతుండడంతో ఆనందంగా ఉన్నది. ఈ పథకాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి. గట్టు బీడుభూములను పచ్చగా చూడాలని ఉన్నది.
నీళ్లందితే కష్టాలు తీరుతాయి
ఎడారి ప్రాంతంగా ఉన్న గట్టులో వర్షాలు పడక ఏటా అనావృష్టితో నష్టాలకు గురవుతున్నాం. ఈ పరిస్థితుల్లో వలసలకు వెళుతూ పొట్ట గడుపుకుంటున్నాం. అక్కడికి వెళ్లి ప్రమాదాలకు గురువుతున్నాం. గట్టు ఎత్తిపోతల ద్వారా అన్ని చెరువులు, కుంటలను నీటితో నింపి పొలాలకు నీరందిస్తే బంగారు పంటలు పండిస్తాము. మా కష్టాల నుంచి గట్టెక్కుతాం.