మక్తల్ టౌన్, నవంబర్ 20: రాష్ట్రంలో మత్స్య సంపదను పెంపొందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. అందుకోసమే వంద శాతం సబ్సిడీపై చేపపిల్లలు అందిస్తున్నారన్నారు. సమీకృత మత్స్య అభివృద్ధి పథకంలో వంద శాతం రాయితీపై మంజూరైన 4 లక్షల 840 రొయ్య పిల్లలను ఆదివారం చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో ఎమ్మెల్యే వదిలిపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. ఇందుకోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు.
కులవృత్తులు చేసే వారిని గుర్తించి వారి కోసం సంక్షేమం అందించిన ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు. రాష్ట్రంలో ముదిరాజ్ కులస్తుల అభ్యున్నతికి సమీకృత మత్స్యాభివృద్ధి పథకంతో రాయితీపై చేప పిల్లలు అందజేస్తున్నట్లు చెప్పారు. దీంతో ముదిరాజ్‌లు ఆర్థికంగా ఎదుగుతున్నారని పేర్కొన్నారు. మక్తల్ నియోజకవర్గంలోని మూడు రిజర్వాయర్లతోపాటు 100కు పైగా చెరువుల్లో చేప పిల్లలను, రొయ్యలను వదిలినట్లు తెలిపారు.
సంగంబండ రిజర్వాయర్‌లో 8.20 లక్షల రొయ్య పిల్లలు మంజూరు కాగా ప్రస్తుతం కొన్నింటిని విడిచిపెట్టామని పేర్కొన్నారు. పెరిగిన చేపలను మార్కెట్‌కు తరలించేందుకు 50 శాతం సబ్సిడీపై వాహనాలను సైతం అందజేస్తున్నట్లు స్పష్టం చేశారు. త్వరలో మక్తల్‌లో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో మత్స్యశాఖ ఏడీ రాణాప్రతాప్, సహకార సంఘం సభ్యుడు రమణ, ఫిషర్మెన్ అనిల్, టీఆర్ఎస్ నాయకులు గవినోళ్ల నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.