మక్తల్ టౌన్, నవంబర్ 20: సంస్కృతీ నిలయాలుగా సరస్వతీ శిశుమందిరాలు పని చేస్తూ, విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నాయని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. సరస్వతీ విద్యాపీఠం స్వర్ణ జయంతిని పురస్కరించుకొని మక్తల్ మినీ స్టేడియంలో ఆదివారం మక్తల్ సరస్వతీ శిశుమందిర్ పాఠశాల ఆధ్వర్యంలో, ఏర్పాటు చేసిన నారాయణపేట జిల్లా ఖేల్ కూద్ పోటీలకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థి క్రమశిక్షణతోపాటు చదువులో రాణించే విధంగా శిశుమందిరాలు బావిభారత పౌరులుగా తీర్చిదిద్దుతున్న విద్యాలయాలుగా సరస్వతీ శిశుమందిరాలు పేరుగాంచాయని పేర్కొన్నారు. స్వర్ణ జయంతి ఉత్సవాల్లో భాగంగా విద్యార్థులకు పోటీలు నిర్వహించడం అభినందనీమన్నారు. గెలుపోటములు సహజమని ప్రతి విద్యార్థి ఇష్టంతో కష్టపడి చదివినప్పుడే భవిష్యత్తులో ముందుకు సాగుతారని సూచించారు.
సరస్వతీ శిశుమందిర్ నారాయణపేట జిల్లా అధ్యక్షుడు గోపన్బాయ్ బాలరాజు, విభాగ్ కార్యదర్శి కుంటి ఎల్లప్ప, మక్తల్ సరస్వతీ శిశుమందిర్ పాఠశాల అధ్యక్షుడు రఘుప్రసన్నభట్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, బీజేపీ నాయకులు కొండయ్య, పాఠశాల అధ్యాపకబృందం, విద్యార్థులు పాల్గొన్నారు.