Raakaasaa | టాలీవుడ్ యంగ్ హీరో సంగీత్ శోభన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘రాకాస’ (Raakaasaa) ఇప్పుడు సినీ ప్రియుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ‘మ్యాడ్’ సినిమాతో యువ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించిన సంగీత్ శోభన్ ఈసారి ఫాంటసీ–హారర్ జానర్లో కొత్త ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో ‘ఆయ్’ మూవీ ఫేమ్ నయన్ సారిక హీరోయిన్గా నటిస్తుండగా, దర్శకురాలు మానస శర్మ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాను పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గతంలో నిహారిక నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకోవడంతో, ఆమె నిర్మాణంలో వస్తున్న ఈ కొత్త ప్రాజెక్ట్‌పై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
యువతరానికి దగ్గరగా ఉండే కథలు, కొత్త కాన్సెప్ట్స్‌కి ప్రాధాన్యం ఇస్తూ నిహారిక నిర్మాణంలో వస్తున్న ప్రతి చిత్రం ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటోంది. ఇటీవల విడుదలైన ‘రాకాస’ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫాంటసీ ఎలిమెంట్స్, హారర్ బ్యాక్‌డ్రాప్, కామెడీ టచ్ అన్నీ కలగలిపి వినోదభరితంగా టీజర్ ఉండటంతో సినిమాపై బజ్ ఒక్కసారిగా పెరిగింది. సోషల్ మీడియాలో కూడా ఈ టీజర్‌కు మంచి స్పందన లభించింది. అప్పటి నుంచి సినిమా రిలీజ్ ఎప్పుడన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ‘రాకాస’ చిత్రాన్ని 2026 ఏప్రిల్ 3న సమ్మర్ కానుకగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు స్పెషల్ పోస్టర్ ద్వారా వెల్లడించారు. సమ్మర్ హాలిడే సీజన్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యువతను కూడా ఆకట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తవగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఫాంటసీ, హారర్, హిలేరియస్ కామెడీ అంశాలతో ఫుల్ ఆన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం సంగీత్ శోభన్ కెరీర్లో మరో ప్రత్యేక మైలురాయిగా నిలుస్తుందా అనే ఆసక్తి నెలకొంది. విభిన్న జానర్లో వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితం సాధిస్తుందో తెలుసుకోవాలంటే ఏప్రిల్ వరకు వేచి చూడాల్సిందే.