వనపర్తి టౌన్, నవంబర్ 20: విద్యార్థులు లక్ష్యాన్ని ఏర్పరుచుకొని పట్టుదలతో చదవాలని వనపర్తి జెడ్పీచైర్మన్ లోకనాథ్‌రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని సూర్యచంద్ర ప్యాలేస్ పాఠశాలలో రెండు రోజులపాటు నిర్వహించిన జవహర్లాల్ నెహ్రూ వైజ్ఞానిక ప్రదర్శన ముగింపు వేడుకకు హాజరై మాట్లాడారు. అబ్దుల్‌కలాం జీవిత చరిత్ర ప్రతిఒక్కరికీ ఆదర్శమని, సాధారణస్థాయి నుంచి శాస్త్రవేత్తగా ఉన్నతస్థాయిలో రాణించారని గుర్తుచేశారు. విద్యార్థులు ఆవిష్కరించిన సేంద్రియ ఉత్పత్తులు, తృణ ధాన్యాల ఉత్పత్తులు, గ్లోబల్ వార్మింగ్, సేంద్రియ తదితర ఆంశాలపై ఆయన పలు సూచనలు ఇచ్చారు. ప్రదర్శనలో 296మంది విద్యార్థులు పాల్గొన్నారని, విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసి ప్రోత్సహించాలన్నారు.
ప్రజల్లో మూఢనమ్మకాలను పారద్రోలి శాస్త్రసాంకేతికతను అభివృద్ధి చేయాలని సూచించారు. అదేవిధంగా ఎమ్మెల్సీ కాటెపల్లి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగిఉన్న సృజనాత్మకతను వెలికితీసి ప్రోత్సహించాలని, వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించడం వారి నూతన ఆలోచనలకు పునాది అని, విద్యార్థులు భవిష్యత్‌లో శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఎమ్మెల్సీ సూచించారు. శాస్త్ర, సాంకేతికత అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో పర్యావరణ, కాలుష్యం ఏర్పడుతున్నందున ప్లాస్టిక్ నిర్మూలన చేయాలని బావి భవిష్యత్ అవసరాల కోసం శాస్త్రవేత్తలుగా ఎదగాలని సూచించారు.
మున్సిపల్ వైస్‌చైర్మన్ వాకిటి శ్రీధర్ మాట్లాడుతూ విద్యార్థులను ఉపాధ్యాయులు మాత్రమే చైతన్యం చేయగలరని, గోపాల్పేట హైస్కూల్ విద్యార్థులు చెత్త నిండినప్పుడు అలారం మోగేలా తయారు చేసిన ప్రదర్శన అద్భుతంగా ఉందన్నారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేసి సన్మానించారు. వైజ్ఞానిక ప్రదర్శనలు విజయవంతం చేసేందుకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి రూ.లక్ష, డాక్టర్ మురళీధర్ రూ.50వేలు ఇవ్వడంపై వారికి కృతజ్ఞతలు తెలిపారు.
మొత్తం 211 ప్రదర్శనలకు గానూ 83 ఇన్స్పైర్ ప్రదర్శన లు ఇవ్వగా అందులో సీనియర్ విభాగంలో 147, జూనియర్ విభాగంలో 64 ప్రదర్శనలు వచ్చాయి. ఈ ప్రదర్శనలో అత్యుత్తమ ప్రతిభను కనబర్చి ప్రదర్శనలు ఇచ్చిన ఇన్నోవేషన్లకు బహుమతులు ప్రదానం చేశారు. అందులో భాగంగా ఇన్స్పైర్ విజేతలు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలు, తిప్డంపల్లి (2), చిట్యాల, అమడబాకుల, వెలగొండ, సోలీపూర్, మామిడిమాడ, మండల పరిషత్ పాఠశాలలు ముమ్మళ్లపల్లి, బున్యాదీపురం పాఠశాలలు ఉన్నాయి.
ఏడు అంశాల్లో సీనియర్, జూనియర్ విభాగాల్లో 28మంది విద్యార్థులు విజేతలుగా ఎంపికయ్యారు. మొదటి బహుమతి పొందిన విద్యార్థులు రాష్ట్రస్థాయి ప్రదర్శనలో పాల్గొననున్నారు. అందులో జీ మౌనిక, యమున, సాయికుమార్, బీ సింధు, కార్తీక్, వీరేశ్, శివ, మిస్బా, అంకిత విజేతలుగా నిలిచారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌చైర్మన్ వామన్‌గౌడ్, జిల్లా సెక్టోరియల్ అధికారి చంద్రశేఖర్, జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాస్, పాఠశాల యాజమాన్యం వెంకటేశ్వర్‌రెడ్డి, వివిధ కమిటీల నిర్వాహకులు గణేశ్‌కుమార్, శంకరయ్య, ఉదయ్‌కుమార్, ఎంఈవో శ్రీనివాస్‌గౌడ్, జీహెచ్ఎంలు తదితరులు పాల్గొన్నారు.