మక్తల్ టౌన్, నవంబర్ 20: తక్కువ నీటి వినియోగంతో పప్పు దినుసుల పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ అధికారులు తగు సూచనలు, సలహాలు అందజేస్తున్నారు. ఆ దిశగా రైతన్నలు యాసంగితో మినుముల పంటపై దృష్టి సారిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చు. అతి తక్కువ నీటి వినియోగంతో మినుముల పంటను యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధికసంఖ్యలో నికర ఆదాయాన్ని పొందవచ్చు. రైతులకు మినుముల పంట సాగుపై వ్యవసాయాధికారులు అవగాహన కల్పించి సాగులో రకాల ఎంపిక యాజమాన్య పద్ధతులు వివరించారు.
నీరు, తేమను బట్టి ఉంటే మధ్యస్థ బరువైన నేలలు అనుకూలం. ఒకసారి నాగలితో, రెండు పర్యాయాలు గొర్రుతో మెత్తగా దున్ని గుంటుకతో దున్నాలి. మెట్ట ప్రాంతాల్లో ఎకరాకు 8 నుంచి 10కేజీల విత్తనాలు అవసరం. కిలో విత్తనాలకు 30గ్రాముల కార్బోసల్ఫేట్ మందుతో విత్తనశుద్ధి చేయాలి. కిలో విత్తనాలకు ఇమిడాక్లో పిడ్ఎంఎల్ లేదా డయోమిస్టేక్స్ 5గ్రాములు కలిపి విత్తన శుద్ధి చేస్తే సుమారు 15 నుంచి 20 రోజుల వరకు రసం పీల్చే పురుగు బారి నుంచి పంటను రక్షించుకోవచ్చు.
విత్తన శుద్ధి చేసేటప్పుడు మొదటి శిలీంధ్ర నాశనులతో శుద్ధి చేసిన తర్వాత కీటక నాశనులతో శుద్ధి చేయాలి. తర్వాత రైజోబియం కల్చర్‌తో కలిపి విత్తనాన్ని నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. ప్రస్తుత పరిస్థితిల్లో మినుము పంట ఎంతో లాభదాయకమని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. రైతులకు పంట సాగుపై అవగాహన సదస్సుల ద్వారా వరి సాగు వద్దని ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచిస్తున్నారు. రసాయన ఎరువులు తగ్గించి సేంద్రియ ఎరువులతో యజమాన్య పద్ధ్దతులను పాటిస్తే దిగుబడులు లాభసాటిగా ఉంటాయని అధికారులు సూచిస్తున్నారు.
యాసంగి సీజన్లో వరికి బదులుగా పప్పుదినుసుల వంటి ఆరుతడి పంటలు సాగు చేస్తే భూసారం పెరుగుతుంది. మినుము పంటను సాగు చేయడం వల్ల నీటి శాతం తక్కువగా ఉంటుంది. రైతుల పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది.
– మిథున్ చక్రవర్తి, ఏవో, మక్తల్