నాగర్‌కర్నూల్, నవంబర్ 19(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం పేదలకు వ్యవసాయం, విద్య, సంక్షేమంతోపాటు వైద్యం అందించడంలో ముందుంటున్నది. దేశంలో ఏ ప్రభుత్వం చేపట్టలేనన్ని పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నది. ఇప్పటికే దీర్ఘకాలిక రోగాలైన బీపీ, మధుమేహం, టీబీ, క్షయ, ఎయిడ్స్, బోధకాలు, క్యాన్సర్‌లాంటి పలు అనారోగ్యాలతో బాధపడుతున్న ప్రజలకు చికిత్సతోపాటు మందులను ఉచితంగా అందిస్తున్నది.
ఈ క్రమంలో ఉచిత కంటి పరీక్షలను సైతం నిర్వహించి, అవసరమైతే కళ్లద్దాలను కూడా పంపిణీ చేసేందుకు నిర్ణయించింది. ఈ బృహత్తర పథకానికి కంటి వెలుగుతో మూడేండ్ల కిందట 2018, ఆగస్టు 15న ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా గ్రామాల్లో ప్రజలందరికీ 2019 మార్చి వరకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించింది. ఓ డాక్టర్, ఆఫ్తాలమిస్ట్, ఏఎన్ఎం, సూపర్వైజర్, ఆశవర్కర్లతో కూడిన వైద్య సిబ్బంది గ్రామాల్లో కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది.
ఇలా ప్రతిఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైతే కళ్లద్దాలను సైతం అందజేసింది. అలాగే అవసరమైన వారికి ఇతర దవాఖానలకు తరలించి శస్త్రచికిత్సలను సైతం చేయించడం తెలిసిందే. అలాంటి మంచి పథకమైన కంటి వెలుగును రెండోసారి అమలు చేసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారు. వైద్యారోగ్యశాఖకు సీఎం రెండు రోజుల కిందట చేసిన ఆదేశాలతో జనవరిలో మరో విడుత కంటి వెలుగు పరీక్షలకు అధికారులు సన్నద్ధం కానున్నారు.
ప్రభుత్వ వైద్యశాఖ అంచనా మేరకు జనాభాలో 25శాతం మంది కంటి సంబంధిత అనారోగ్యాలతో బాధపడుతున్నారు. ఈ పరీక్షలు, చికిత్సలు స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో పేదలు కంటి పరీక్షలకు ఆసక్తి చూపడం లేదు. దీన్ని గుర్తించిన ప్రభుత్వం కంటి వెలుగు పథకం ద్వారా ప్రజలకు కంటి పరీక్షలు ఉచితంగా ఆధునిక సాంకేతిక పరికరాలతో నిర్వహించేందుకు మరోసారి చర్యలు తీసుకుంటున్నది. వచ్చే ఏడాది జనవరి 18వ తేదీనుంచి కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం కానున్నది.
ఇందులో భాగంగా ఆధార్ లేదా ఇతర గుర్తింపుకార్డులతో దూరదృష్టి, హ్రస్వదృష్టికి సంబంధించిన పరీక్షలను చేయడం జరుగుతుంది. కంట్లో శుక్లాలున్నాయా, ఇన్ఫెక్షన్లు ఉన్నాయా అని పరిశీలిస్తారు. ఒకవేళ శుక్లాలుంటే ఆఫ్తాలమిస్ట్ ఆధ్వర్యంలో కంప్యూటరైజ్డ్ కంటి పరీక్షలు చేస్తారు. సాధారణ దృష్టి లోపాలుంటే అక్కడికక్కడే రీడింగ్ గ్లాసెస్ అందజేస్తారు. ప్రత్యేక అద్దాలు అవసరమైతే నెలరోజుల్లో వైద్యసిబ్బంది ప్రజల ఇంటి వద్దకే వెళ్లి అందజేస్తారు.
ఇలా ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల్లో ప్రతిఒక్కరికీ కంటి పరీక్షలు చేస్తారు. 2011జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి పాలమూరులో 35లక్షల మంది జనాభా ఉన్నట్లుగా అంచనా. అయితే ఈ పదకొండేండ్లలో 3లక్షల మంది జనాభా పెరిగినట్లుగా అంచనా. దీని ప్రకారంగా ఐదు జిల్లాల్లో 38,68,245మందికి కంటి పరీక్షలు నిర్వహించేందుకు వైద్యారోగ్యశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయనున్నది.
త్వరలో చర్యలు తీసుకుంటాం
సీఎం కేసీఆర్ ఆదేశాలతో 2023, జనవరి 18న కంటి వెలుగు నిర్వహణకు చర్యలు తీసుకుంటాం. 2018లో కంటి వెలుగు పథకంలో భాగంగా నాగర్‌కర్నూల్‌లో 5లక్షల మందికిపైగా ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించాం. 53వేల మందికి కళ్లద్దాలను అందజేశాం. రెండో విడుత కంటి వెలుగుకు అవసరమైన వైద్య సిబ్బంది నియామకం, చికిత్స పరికరాలను అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటాం.
– సుధాకర్లాల్, డీఎంహెచ్‌వో, నాగర్‌కర్నూల్ జిల్లా