మహబూబ్‌నగర్, నవంబర్ 19 : మహబూబ్‌నగర్ జిల్లాకు నర్సింగ్ కళాశాల మంజూరైనట్లు ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ ఎస్.వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ స్వరాజ్యలక్ష్మితో కళాశాల ఏర్పాటుపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డిసెంబర్ నుంచి నర్సింగ్ కళాశాలలో తరగతులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నర్సింగ్ కళాశాల నూతన భవనాన్ని నిర్మించనున్నట్లు చెప్పారు. గతంలోనే స్థలాన్ని సేకరించి సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. మొదటి బ్యాచ్‌లో 60 మందితో తరగతులు
ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో భవిష్యత్‌లో అవసరమైన అన్ని వసతులను కల్పించడంతోపాటు అత్యధికంగా విద్యార్థులు చదువుకునేలా అవకాశం కల్పిస్తామన్నారు. సాధ్యమైనంత త్వరగా నర్సింగ్ పీజీ కళాశాల మంజూరుకు కృషి చేస్తానని మంత్రి స్పష్టం చేశారు. జిల్లాలో గతంలో ప్రభుత్వ ప్రధాన దవాఖాన అరకొర వసతులతో నిర్వహణ ఉండేదని గుర్తు చేశారు. డాక్టర్లు, నర్సుల కొరతతో రోగులకు ఇబ్బందులు ఎదురయ్యేవని, కానీ నేడు దవాఖానలో అన్ని సౌకర్యాలు, వసతులు కలిపంచి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.
పాలమూరును సుందరంగా తీర్చిదిద్దాం
మహబూబ్‌నగర్ టౌన్, నవంబర్ 19: మురుగు కాల్వలు, దుర్వాసనతో అస్తవ్యస్తంగా ఉన్న పాలమూరును సుందరంగా తీర్చిదిద్దామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో రూ.4 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అశోక్ టాకీస్ చౌరస్తా, వన్‌టౌన్ వద్ద జంక్షన్ల సుందరీకరణ పనులు, రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. బండ్లగేరిలో మహిళ భవనాన్ని, వీధి వ్యాపార సమూదాయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహబూబ్‌నగర్ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసామన్నారు.
కొందరు రహదారిపైకి వచ్చి భవనాలను నిర్మించుకుంటున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. ముడా నిధులు రానున్నాయని, ఇటీవల సీఎం కేసీఆర్ మహబూబ్‌నగర్ మున్సిపాలిటీకి రూ.100కోట్లు మంజూరు చేశారన్నారు. ఆయా వార్డుల్లో పర్యటించి అవసరమైన చోట అభివృద్ధి పనులు చేపడుతామని చెప్పారు. అనంతరం మెట్టుగడ్డ జంక్షన్లో హై మాస్ట్ లైట్లను ప్రారంభించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, వైస్ చైర్మన్ తాటిగణేశ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్‌యాదవ్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్, కౌన్సిలర్లు రాము, గోవిందు, రోజా, పద్మ, ముస్తాక్, నీరాజ, షేక్ఉమర్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు రామలింగం, నాయకులు శాంతయ్య,విఠల్‌రెడ్డి, వెంకటేశ్, నూరుల్‌హసన్ పాల్గొన్నారు.
అన్ని కులాలకు కమ్యూనిటీ భవనాలు
పాలమూరు, నవంబర్ 19: అన్ని కులాలకు కమ్యూనిటీ భవనాలు నిర్మిస్తామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని బృందావన్ కాలనీ అభయాంజనేయస్వామి ఆలయ వార్షికోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. పూజలు చేసి స్వామికి వెండి కిరీటాన్ని సమర్పించారు. అనంతరం రూ.10లక్షలతో మహిళా కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ప్రొసీడింగ్స్‌ను స్థానికులకు అందజేశారు. శివ మార్కండేయ ఆలయంలో రూ.20లక్షల వ్యయంతో నిర్మించనున్న పద్మశాలీ కల్యాణ మండపానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో కబ్జాకు గురైన స్థలాన్ని వెంటనే స్వాధీనం చేసుకొని రూ.25 లక్షలతో పార్కు, ప్రహరీ నిర్మించడంతో స్థానికులు సేదతీరుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో పద్మశాలీ సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌రావు, పాలమూరు సాహితీ అధ్యక్షుడు భీంపల్లి శ్రీకాంత్ పాల్గొన్నారు.
సంబురంగా సదర్
సదర్ ఉత్సవం ఘనంగా నిర్వహించడం సంతోషంగా ఉందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సంప్రదాయంగా జరిగే ఉత్సవాలు పట్టణంలో ఎంతో ప్రత్యేకమైనవని తెలిపారు. సీఎం కేసీఆర్ కుల వృతులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని, వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చారన్నారు. మహబూబ్‌నగర్ బండమీదపల్లిలో కురుమ యాదవ సంఘం ఆధ్వర్యంలో శనివారం రాత్రి ఏర్పాటు చేసిన సదర్ ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో గొర్రెలకాపరుల సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు శాంతయ్యయాదవ్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, కురుమ యాదవ సంఘం నాయకులు జంగయ్య, శ్రీనివాసులు, రాజుయాదవ్ పాల్గొన్నారు.
అభివృద్ధి వైపే ప్రజలు
మహబూబ్‌నగర్, నవంబర్ 19: ప్రజలకు మంచి చేయాలనే తపనతో ఆవిర్భవించిన టీఆర్ఎస్ వైపు ప్రజలు మొగ్గుచూపుతున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో హన్వాడ మండలం లింగన్నపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ ముఖ్య నాయకులు కుమ్మరి హనుమయ్య, కుమ్మరి శ్రీనివాసులు, కుమ్మరి వెంకటేశ్, శ్రీనుయాదవ్, నరేశ్, గంగాధర్, గోపాల్, హనుమంతు, మల్లేశ్ యాదవ్‌తోపాటు 100 మందికిపైగా నాయకులు, కార్యకర్తలు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వీరికి కండువాలు కప్పి పార్టీలోకి మంత్రి ఆహ్వానించి మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలరాజు, జెడ్పీటీసీ విజయనిర్మల రమణారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కరుణాకర్‌గౌడ్ పాల్గొన్నారు.