వనపర్తి, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): మానవ జీవితంలో అడుగడుగునా సైన్స్ ఉన్నదని, సైన్స్ లేకుండా జీవితం లేదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. సైన్స్ జీవితంలో ఒక భాగం కావాలని సూచించారు. శనివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో రెండ్రోజుల పాటు నిర్వహించనున్న జిల్లా వైజ్ఞానిక ప్రదర్శనకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మూఢత్వం, అంధత్వం మనుషులను బలిగొంటుందన్నారు. వీటి నుంచి బయట పడటానికి సైన్స్ ఎంతో దోహదం చేస్తుందని చెప్పారు. డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగంలో శాస్త్ర విజ్ఞానాన్ని పెంపొందించడం ప్రభుత్వాల బాధ్యత అని స్పష్టం చేశారని గుర్తు చేశారు. అందులో భాగంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైన్స్ ఫెయిర్లను నిర్వహించి విద్యార్థి దశ నుంచే సైన్స్‌పై ఆసక్తి పెంచేలా కృషి చేస్తున్నట్లు చెప్పారు. సృజనాత్మకతను, శాస్త్రీయ ఆలోచనలను పెంపొందిస్తున్నాయని తెలిపారు.
సమాజంలో నెలకొన్న జాఢ్యాలను, మూఢ నమ్మకాలను పారదోలడానికి ఎంతో ఉపయోగపడుతాయని చెప్పారు. పరిశోధించిన, కనుగొన్న అంశాన్ని ప్రజల్లోకి ప్రసరింపజేయాలని కోరారు. అంతర్జాతీయంగా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో జరుగుతున్న అభివృద్ధిని వివిధ దేశాల్లో ప్రతి సంవత్సరం నిర్వహించే సైన్స్ కాంగ్రెస్‌లో ప్రదర్శిస్తారని తెలిపారు. ఫలితాలు ఎలా ఉన్నాయో ప్రపంచానికి పరిచయం చేస్తారన్నారు.
అనంతరం పాఠశాల, కళాశాల స్థాయి పాఠ్యాంశాల్లో పొందుపరుస్తారని వెల్లడించారు. టెక్నాలజీ వల్లే ప్రపంచం పురోగతి చెందుతున్నదని చెప్పారు. లక్షల సంవత్సరాల మానవుడి మేధస్సు నుంచి వచ్చిందే సైన్స్ అన్నారు. శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందడంతోనే భూమి మీద నిల్చొని చంద్రమండలం మీదకు రాకెట్లను పంపిస్తున్నామని తెలిపారు. పిల్లలను మూఢ నమ్మకాలకు దూరంగా.. శాస్త్రీయ ధోరణికి దగ్గరగా తయారు చేయాలని పిలుపునిచ్చారు.
పిల్లల్లో ప్రశ్నించే తత్వాన్ని అలవర్చాలని, ప్రశ్నిస్తే కోపగించుకోకూడదని, అవసరమైతే తెలుసుకుని జవాబు చెప్పాలని తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు సూచించారు. పిల్లలకు కులం, మతం, జాతి పేరిట పెంచొద్దన్నారు. శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో తన జీతం నుంచి సైన్స్‌ఫెయిర్‌కు రూ.లక్ష విరాళం అందజేస్తున్నట్లు చెప్పారు. మొత్తాన్ని కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషాకు అందజేశారు. అనంతరం కలెక్టర్ షేక్‌యాస్మిన్ బాషా మాట్లాడుతూ గతంలో మాదిరిగా కాకుండా ఉపాధ్యాయులు, విద్యార్థులకు కాన్సెప్ట్ బేస్డ్ ఎడ్యుకేషన్ అందించాలని సూచించారు. శాస్త్ర సాంకేతిక రంగాలవైపు ఆసక్తి చూపేలా కృషి చేయాలని అన్నారు.
వినూత్నంగా ఆలోచించడం ద్వారా ఇది సాధ్యమైందని అన్నారు. తర్వాత మంత్రి, అధికారులతో కలిసి విద్యార్థులు ప్రదర్శించిన వైజ్ఞానిక ప్రదర్శనను తిలకించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, డీఈవో రవీందర్, మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, ఎంపీపీలు కిచ్చారెడ్డి, పద్మావతి, జెడ్పీటీసీలు భార్గవి, రాజేంద్రప్రసాద్, తాసిల్దార్ రాజేందర్‌గౌడ్, కౌన్సిలర్లు ప్రేమ్‌నాథ్‌రెడ్డి, జయసుధ, గొర్రెల కాపరుల సంఘం అధ్యక్షుడు కురుమూర్తి యాదవ్, నాగవరం సింగిల్ విండో అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.