మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, నవంబర్ 19: కొంతకాలంగా మహబూబ్‌నగర్‌లో వరుసగా బంగారు పుస్తెల గొలుసులు, బైక్‌లను అపహరించిన నలుగురు నిందితులను పట్టుకొని వారి నుంచి 4 బంగారు పుస్తెల గొలుసులు ( 115 గ్రామల బంగారం) 4 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకొని అంతర్రాష్ట్ర నిందితులను అరెస్ట్ చేసినట్లు మహబూబ్‌నగర్ ఎస్పీ ఆర్ వెంకటేశ్వర్లు తెలిపారు.
గురువారం జిల్లా కేంద్రంలోని పోలీసుపరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ కేసు వివరాలు వెల్లడించారు. వీరంతా కర్ణాటక రాష్ట్రంలోని యాద్గీర్ జిల్లాలోని గుర్మిట్కల్ మండలానికి చెందిన నలుగురు యువకులు స్నేహితులుగా, చెడు ఆలవాట్లు మద్యపానానికి అలవాటుపడి వీరి జల్సాలకోసం డబ్బులు సరిపడక కొత్తగా దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నారు.
ఈక్రమంలో ఈనెల 9వ తేదీన మధ్యా హ్నం 3 గంటలకు మహబూబ్‌నగర్‌లోని వడ్డెరబస్తీలో వడ్డె లక్ష్మి అనే ఆశ వర్కర్ తన విధులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా ఇద్దరు బైక్‌పై వచ్చి ఆమె మెడలో ఉన్న బంగారు పుస్తెల తాడును తెంపుకొని పారిపోతుండగా, ఆమె గట్టిగా అరవడంతో అక్కడ ఉన్న స్థానికులు ఆప్రమత్తమై వెంటనే 100 డయల్‌కు ఫోన్ చేశారు.
మహబూబ్‌నగర్ రూరల్ క్రైమ్ పోలీసులు స్థానికుల సహాయంతో నిందితులను వెంబడించగా బైక్‌ను వదిలేసి పారిపోయారని చెప్పారు. బైక్ ఆధారంగా విచారణ ప్రారంభించగా దొంగలు కర్ణాటకలోని గుర్మిట్కల్ గ్రామానికి చెందినవారిగా గుర్తించినట్లు తెలిపారు. ఈ క్రమంలో దొంగతనం జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాల ఫుటేజ్‌లో నిందితుల కదలికలు కనిపించకపోవటంతోపాటు ముసుగులు ధరించారన్నారు.
నిందితుల ఆనవాళ్లు ఆధారా లు గమనించి శనివారం ఉదయం మెట్టుగడ్డ ప్రాంతంలో పోలీసులు తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా గుర్మిటకల్ గ్రామానికి చెందిన నరేశ్, శ్రీను, ఊశప్ప బైక్‌పై కనిపించగా పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. బంగారు గొలుసులు, బైక్‌ల చోరీ చేస్తున్నట్లు ఒప్పుకున్నట్లు ఎస్పీ తెలిపారు. మొత్తం 6 కేసుల్లో నిందితులుగా ఉన్నారని తెలిపారు. ప్రధాన నిందితుడైన నరేశ్, శ్రీను, ఊశప్పతో కలిసి దొంగతనం చేసేవాడు.
శనివారం పాలమూర్ యూనివర్సిటీ దగ్గర దొంగతనానికి రెక్కీ ఉన్నట్లు శ్రీను, ఊషప్ప తెలపడంతో వీరిచ్చిన సమాచారం మేరకు గురిమిట్కల్కు చెందిన ఆలిగెరి శ్రీనివాస్, బాల నేరస్తుడు అంజిలను పట్టుకున్నట్లు తెలిపారు. వీరినుంచి రూ. 5 లక్షల విలువ గల బంగారు గొలుసులు , నాలుగు బైక్‌లు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకొని నరేశ్, శ్రీను, ఊశప్పపై పీడీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. కేసును చేధించిన డీఎస్పీ మహేశ్, సీఐ రాజేశ్వర్‌గౌడ్, రూరల్ ఎస్సై వెంకటేశ్వర్లు, భూత్పూర్ ఎస్సై భాస్కర్‌రెడ్డిని ఎస్పీ ఆభినందించారు. ఈ కేసులో ప్రతిభ కనబర్చిన ఎస్సైలు వెంకటేశ్వర్లు, రమేశ్, హెచ్‌సీలు కలీం, శంకర్, ప్రభాకర్‌రెడ్డి, పీసీలు నాగరాజు, మహేందర్, రఘు, చంద్రశేఖర్‌రెడ్డి, రాజాశ్యామ్, శ్రీనివాసులు, చంద్రశేఖర్‌కు నగదు రివార్డులు అందజేశారు.