అమ్రాబాద్, నవంబర్ 16 :కాకతీయుల చరిత్ర సాక్ష్యాలు కనుమరుగవుతున్నాయి.నల్లమలలో నిర్మించిన కోట ప్రాభవం కోల్పోతున్నది.శత్రుదుర్భేధ్యంగా నిర్మించిన ఈ కట్టడం గుప్తనిధుల వేటలో ఆనవాళ్లు కోల్పోయింది. మీటరు వెడల్పుతో నిర్మించిన గోడలు కి.మీ. చొప్పున ఉన్నాయి. అయితే అడ్డగోలు తవ్వకాలతో పూర్తిగా ధ్వంసమైంది. ఎంతో ఎత్తులో ఉన్న కోట గోడ శిథిలమవుతున్నది. ఏండ్ల చరిత్ర ఉన్న ఈ కట్టడాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తే నాటి నిర్మాణాలు నేటి ప్రజలకు సాక్షాత్కరించనున్నాయి. పర్యాటక శాఖ చర్యలు చేపట్టి ఆనవాళ్లు కోల్పోయిన కోటను అభివృద్ధి చేయాలని సందర్శకులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రకృతి ఒడిలో సేదతీరే నల్లమల అందాలు వర్ణణాతీతం. ఎన్నో వనమూలికలు, ప్రకృతి అందాలు, జలపాతాలు, సుందర వనాలు, ఒళ్లు గగుర్పొడిచే లోయలు, సిరిసంపదలు నల్లమలకు ఆభరణాలు. అంతేకాకుండా అటవీ తల్లి ఒడిలో చరిత్ర కాలగర్భంలో కనుమరుగవుతున్న ఎన్నో శిల్పసంపదులు ఉన్నాయి. అందులో ఒకటి.. కాకతీయులు నిర్మించిన కోట శిథిలావస్థకు చేరుకున్నది. 13వ శతాబ్దానికి చెందిన కోట ఆనవాళ్లు ప్రస్తుతం కనుమరుగవుతున్నాయి.
కనుమరుగవుతున్న కోట..
చరిత్ర ప్రకారం.. శ్రీశైలం-హైదరాబాద్ రోడ్డు మా ర్గంలో దాదాపు 600 మీటర్ల ఎత్తులో.. శ్రీశైలానికి ము ఖద్వారంగా మన్ననూర్ నిరంజన్ షావళి దర్గా వద్ద రా ణి రుద్రమదేవి కోట నిర్మాణాన్ని మొదలుపెట్టారు. 13 వ శతాబ్దానికి చెందిన కాకతీయ వంశస్తుల్లో చివరివారై న ప్రతాపరుద్రుడు కోట నిర్మాణాన్ని పూర్తి చేశారు. రాకపోకలకు ఇబ్బంది లేకుండా దాదాపు 127 కిలోమీటర్ల మేర ఫరహాబాద్, కొల్లాపూర్, కల్వకుర్తి నియోజకవర్గాలను కలుపుతూ గోడను నిర్మించారు. నల్లమల ప్రాంతాన్ని కాకతీయులతోపాటు శ్రీరామచంద్రుడి వం శస్తులైన ఇక్షాకులు, శాలివాహనులు, విష్ణు కుండిన్లు, చాళుక్యులు సైతం పాలించినట్లు చరిత్ర ఆధారంగా తెలుస్తున్నది. మహాదుర్భేద్యంగా నిర్మించిన ఈ కోటను కాకతీయుల అనంతరం 15వ శతాబ్దం లో దేవరకొండ రాజధానిగా సురభి వంశస్తులు పాలించారు. వారి హ యాంలో బీజాపూర్ సుల్తాన్లు కోటను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించారు.
ఢిల్లీ బాద్షా సైనికుల సహకారంతో దండయాత్ర చేసినప్పటికీ కోటను స్వాధీనం చేసుకోలేకపోయారు. ఉమామహేశ్వర ఆలయంలో నిత్యన్నదాన సత్రాన్ని ఆశచూపి కొందరు గూఢాచార మహ్మదీయుల ను మారువేశంలో ఆలయంలో పనికి కుదిర్చి కోటకు సంబంధించి న సమాచారాన్ని సేకరించారు. కోటకు ఎ దురుభాగంలో ఉన్న కప్పగుట్ట నుంచి ఫిరంగులను ఎ క్కుపెట్టి కోటను ధ్వంసం చేశారు. సురభిరాజు మరణం అనంతరం కోటను స్వాధీనపర్చుకొని కోటతోపాటు పలు ఆలయాలను ధ్వంసం చేసి సంపదను దోచుకున్నా రు. శత్రువుల చొరబాటు వల్ల కోట గోడ చాలా వరకు కూలిపోయింది. వర్షాల కారణంగా గోడ మరింత శిథిలావస్థకు చేరుకున్నది.
నల్లమలకు రావాలంటే తలుపు ల కురువగా పిలువబడే రాతి కమాన్ కింది నుంచి కొన్ని నిర్ణీత సమయాల్లో మాత్రమే ప్రవేశించే అవకాశం ఉం డేది. దానివద్ద భటులు నిరంతరం కాపలా కాస్తూ ఉండేవారు. కేవలం కాలినడక ద్వారానే వర్తకులు ఈ కొండ ను ఎక్కి వ్యాపారం చేసుకొని వెళ్లేవారు. 19వ శతాబ్దంలో కలెక్టర్ యూసుఫుద్దీన్ స్థానిక నిధులతో ఘాట్‌రోడ్డు నిర్మించారు. అక్కడినుంచి ఫరహాబాద్ వరకు రోడ్లు ఏ ర్పాటు చేసి విశ్రాంతి భవనం కూడా నిర్మించినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. ఇదిలా ఉండగా, కాకతీయుల చరిత్రకు సంబంధించిన సాక్ష్యా లు రోజురోజుకూ కనుమరుగవుతున్నాయి. దండకారణ్యంలో నిర్మించిన కోటను గుప్తనిధుల కోసం తవ్వకాలను జరిపి పూర్తిగా ధ్వంసం చేశా రు. ఎంతో ఎత్తులో నిర్మించిన గోడ నేలమట్టమైంది. కోట గోడలను పునరుద్ధరి స్తే నల్లమల ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.