మహబూబ్నగర్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గోదాంలు రైతుల పాలిట కల్పతరువుగా మారాయి.కష్టపడి పండించిన పంట ఉత్పత్తులకు మద్దతు ధర లభించకుంటే అనుకూల ధర వచ్చే వరకు గిడ్డంగుల్లో నిల్వ ఉంచొచ్చు. ఇక్కడి ధాన్యానికి ప్రభుత్వం తరఫున గ్యారెంటీ ఉండనున్నది. అంతేగాక నిల్వ ఉంచిన ఉత్పత్తులను రుణం పొందే అవకాశం ఉన్నది. ఇప్పటికే మండలానికి ఒకటి చొప్పున మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. పాలమూరు జిల్లాకు కొత్తగా మరో 10 గోదాంలు మంజూరయ్యాయి. దిగుబడి మేర ఆయా ప్రాంతాల్లో ఏర్పాటుకు అధికారులు సన్నద్ధమయ్యారు. గోస తీరుస్తుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే కోల్డ్ స్టోరేజ్ మాదిరిగా ఏసీ గోదాంలు నిర్మించాలనే ప్రతిపాదనలూ ఉన్నాయి.
పంటలకు మద్దతు ధర వచ్చే వరకు నిల్వ ఉంచి.. ధర పెరిగాక అమ్ముకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం మండలానికో గోదాంను నిర్మిస్తున్నది. ఇప్పటికే నాగర్కర్నూల్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో ఏర్పాటు చేయగా.. మహబూబ్నగర్ జిల్లాకు సుమారు 10 గోదాంలు నిర్మించేందుకు స్థల సేకరణ పూర్తయింది. రైతులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ అన్ని రకాల పథకాలను అమలు చేస్తున్నారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కేవలం జిల్లా కేంద్రాలతోపాటు మార్కెట్ కమిటీలు ఉన్న చోటే గోదాంలు ఏర్పాటు చేసేవారు. ఇవన్నీ వ్యాపారులకే ప్రయోజనకరంగా ఉండేవి. తెలంగాణ వచ్చాక పరిస్థితిలో పూర్తి స్థాయి మార్పులొచ్చాయి. ఆయా మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో ప్రతి మండలానికీ సుమారు ఐదు వేల మెట్రిక్ టన్నుల కెపాసిటీతో గోదాంలు నిర్మించారు. దీంతో రైతులు ధాన్యాన్ని దర్జాగా గోదాముల్లో నిల్వ ఉంచుకునే వీలు ఏర్పడింది. ఇటీవల వర్షాలు భారీగా కురిసి జలాశయాల్లో పుష్కలంగా నీళ్లు ఉండడంతో రైతులు పెద్ద ఎత్తున పంటలను సాగు చేశారు.
మండలానికో గోదాం..
ఏటా ఆయా సీజన్లకు ముందుగానే ప్రభుత్వం మద్దతు ధరలు ప్రకటిస్తున్నది. పీఏసీసీఎస్ల ద్వారా వరిని, సీసీఐ ద్వారా పత్తిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కొంటున్నాయి. మిగతా పంటలు అమ్ముకోవాలంటే దళారుల బెడద తప్పడం లేదు. రైతులు వారికి అగ్గువకు అమ్ముకున్నాక.. మార్కెట్లో ధరలు పెరుగుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం మండలానికో గోదాంను నిర్మిస్తున్నది. ఇప్పటికే ఆయా జిల్లాల్లో అనుకున్న లక్ష్యాలను పూర్తి చేశారు. నాగర్కర్నూల్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలో 11, వనపర్తి జిల్లాలో ఐదు చోట్ల గోదాంలను నిర్మించారు. ఒక్కొక్కటి ఐదు వేల మెట్రిక్టన్నుల సామర్థ్యంతో ఏర్పాటు చేసి రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చారు.
మహబూబ్నగర్ జిల్లాలో పది చోట్ల నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గోదాముల్లో నిల్వ ఉంచిన ధాన్యానికి ప్రభుత్వం గ్యారంటీ ఉంటుంది. అంతేకాకుండా నిల్వ ఉంచిన ధాన్యంపై రుణం కూడా తీసుకోవచ్చు.ఇదిలా ఉండగా, రైతులను మరింత ఆదుకోవాలనే ఉద్దేశంతో శీతల గిడ్డంగులను నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఈ మేరకు అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. శీతల గిడ్డంగుల్లో కూరగాయలు, ఇతర పంటలను చాలాకాలంపాటు నిల్వ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆయా జిల్లాల్లో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఏసీ గోదాంలు ఉన్నాయి. ఇందులో పంటలు నిల్వ చేసుకునేందుకు భారీగా ఖర్చు భరించాల్సి వస్తున్నది. శీతల గిడ్డంగులు, మండలానికో గోదాం నిర్మిస్తుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.