గద్వాల, నవంబర్ 16 : గ్రామీణ ప్రాంతాల్లో ప్ర జలకు కోళ్ల పెంపకం ప్రధాన ఆదాయంగా ఉండేది. రానురానూ నాటుకోళ్లు కనుమరుగై బాయిలర్ కోళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలో నాటుకోళ్ల పెంపకానికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుంది. పేద, మధ్య తరగతి వారికి సబ్సిడీపై కోడిపిల్లలను సైతం పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నది. నాటుకోళ్లు తినడంవల్ల పౌష్టికాహారం కూడా లభిస్తుందని భావించింది. జోగుళాంబ జిల్లాకు 415 యూనిట్లు కేటాయించింది. ఒక్కో యూనిట్ రూ.1,850 కాగా.. లబ్ధిదారుడు కేవలం రూ.600 చెల్లిస్తే చాలు. ప్రభుత్వం సబ్సిడీ కింద రూ.1,250 భరిస్తున్నది. ఒక్కో యూనిట్ కింద లబ్ధిదారుడికి నాలుగు వారాల వయస్సు ఉన్న 25 కోడి పిల్లలను ఇవ్వనున్నది.
ఇవి పెరిగి పెద్దయ్యాక ఒక్కో కోడి జీవితకాలంలో సరాసరిన 160 నుంచి 200 గుడ్లు పెట్టే అవకాశం ఉంటుంది. బాయిలర్ కోళ్ల కంటే నాటుకోడి మాంసం రుచిగా ఉంటుంది. ఇందులో పోషక విలువలు కూడా ఎక్కువగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఈ కోడి, గుడ్లు తినడం వల్ల చిన్నారుల్లో దృష్టి లోపం నివారిస్తుంది. కొవ్వును కరిగిస్తుంది. నాటుకోళ్లను పెంచుకునే లబ్ధిదారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని, ఇప్పటివరకు 11 మంది లబ్ధిదారులు నాటు కోళ్ల పెంపకం కోసం జిల్లా పశువైద్యకార్యాలయంలో డీడీలు చెల్లించారని జిల్లా పశువైద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు.