హన్వాడ, నవంబర్ 16: తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం కులవృత్తులకు పూర్వవైభవం తెచ్చిందని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని, దళారులను నమ్మి మోసపోవద్దని పేర్కొన్నారు. బుధవారం మండలంలోని హన్వాడ, నాయినోనిపల్లి, ఇబ్రహీంబాద్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మిషన్‌భగీరథ ద్వారా ఇంటింటికీ కృష్ణాజలాలు అందిస్తున్నామని, 65ఏండ్లు పాలించిన సీమాంధ్ర పాలకులు పాలమూరు జిల్లాకు ఏం చేశారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలుసున్నాయని గుర్తుచేశారు. రైతులకు బీమా, పెట్టుబడి సాయం, వ్యవసాయానికి 24గంటల విద్యుత్ ఇస్తున్నట్లు తెలిపారు. పార్టీలకతీతంగా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. ప్రతి గ్రామానికి కోట్ల రూపాయల నిధులు విడుదల చేసి అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
ప్రజారోగ్యంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని, ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ దవాఖానలో మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. కర్వెన, ఉదండాపూర్ రిజర్వాయర్లు త్వరలోనే పూర్తికానున్నాయని, కేసుల వల్ల నిర్మాణ పనులు సకాలంలో పూర్తికాలేదన్నారు. అదేవిధంగా ఇబ్రహీంబాద్లోని హేమసముద్రం చెరువులో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చేపపిల్లలను విడుదల చేసి మాట్లాడారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు రూ.2కోట్లు విడుదల చేస్తే తెలంగాణ ఏర్పడిన తర్వాత మత్స్యసంపదకు రూ.5వేల కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు ఉచితంగా చేపపిల్లలు పంపిణీ చేసి అండగా నిలిచిందన్నారు. హేమసముద్రంలో లక్షా 20వేల చేపపిల్లలను వదిలినట్లు తెలిపారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్‌పవార్, ఎంపీపీ బాలరాజు, జెడ్పీటీసీ విజయనిర్మల, మత్స్య సహకార సంఘం జిల్లా ఇన్చార్జి అధ్యక్షుడు సత్యనారాయణ, సింగిల్‌విండో చైర్మన్ వెంకటయ్య, వైస్‌చైర్మన్ కృష్ణయ్యగౌడ్, తాసిల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో ధనుంజయగౌడ్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ రాజుయాదవ్, ఏపీఎం సుదర్శన్, ఎంపీటీసీలు వడ్లశేఖర్, సత్యమ్మ, కల్పన, చెన్నయ్య, సర్పంచులు రేవతి, వసంత, నాయకులు జంబులయ్య, కొండ బాలయ్య, బసిరెడ్డి, ఆనంద్, రాఘవులు, హరిచందర్, రమణారెడ్డి, సత్యం, యాదయ్య, జహంగీర్, శ్రీనివాసులు, ఆంజనేయులు, చెన్నయ్య, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.