మహబూబ్‌నగర్ టౌన్, నవంబర్ 16 : మహబూబ్‌నగర్ పట్టణం కార్పొరేషన్ దిశగా అడుగులు వేస్తున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. బుధవారం మహబూబ్‌నగర్ మున్సిపల్ సమావేశ మందిరంలో నూతనంగా ఆధునీకరించిన కౌన్సిల్ హాల్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం సమావేశ మందిరంలో చైర్మన్ కేసీ నర్సింహులు అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హా జరై మాట్లాడారు. 2014 తర్వాత జరిగిన ప్రతి కౌన్సిల్ సమావేశంలో వార్డుల్లో తాగునీటి సమస్య, విద్యుత్ దీ పాలు, డ్రైనేజీలు, సీసీ రోడ్లు సరిగ్గా లేవని సభ్యులు స మావేశం దృష్టికి తీసుకొచ్చేవారని గుర్తు చేశారు. నేడు ఆ సమస్యలను వెతికే పనిలో సభ్యులు ఉన్నారని, ప్రతి సమస్యనూ పరిష్కరించుకుంటూ వస్తున్నామని చెప్పా రు. హైదరాబాద్ తర్వాత మహబూబ్‌నగర్‌ను ముడా గా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో కార్పొరేషన్‌గా మారడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రం నలువైపులా శరవేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఓ పక్క క్రీడా మైదానాలు, మరో ప క్క ఐటీ, వీరన్నపేట సమీపంలో డబుల్ బెడ్రూం ఇం డ్లు, గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసి ప్రత్యేక గు ర్తింపు తీసుకొచ్చామన్నారు.
హన్వాడ మండలంలో ఫు డ్పార్కు ఏర్పాటు చేస్తామని, చించోలి రోడ్డు విస్తరణ తో వీరన్నపేట ప్రాంతానికి డిమాండ్ రానున్నదని వివరించారు. పాలిటెక్నిక్ కళాశాలను ఇంజినీరింగ్ కళాశాలగా ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయని పేర్కొన్నారు. మల్టీస్పెషాలిటీ దవాఖాను నిర్మించి హార్ట్తోపాటు సకల వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. పెద్ద చెరువు వద్ద సస్పెన్షన్బ్రిడ్జి, ఐలాం డ్ సుందరీకరణ కోసం రూ.48 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. అంతకుముందు రూ.40 కోట్లు ఇవ్వగా.. మొత్తం 80 కోట్లతో ట్యాంక్‌బండ్ అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. దాదాపు రూ.500 కోట్లతో పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నామని, సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలను ఎరువుగా మార్చేందుకు రూ.5 కోట్లతో ట్రీట్మెం ట్ ప్లాంట్‌ను ఏర్పాట చేశామన్నారు. ట్రాఫిక్ సిగ్నల్, సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించాలని ఎస్సీ వెంకటేశ్వర్లును ఆదేశించారు. హైదరాబాద్ తరహాలో మహబూబ్‌నగర్‌ను అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు. అధికారులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. పట్టణాభివృద్ధికి రూ.100 కోట్ల ప్రత్యేక నిధులను తీసుకొచ్చిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను కౌన్సిల్ సభ్యులు సత్కరించారు.
సినీ నటుడు కాంతారావు జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, మున్సిపల్ వైస్ చైర్మన్ తాటి గణేశ్, కమిషనర్ ప్రదీప్‌కుమార్, కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.