పాలమూరు, నవంబర్ 14 : పేదల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. జెడ్పీ సమావేశ మందిరంలో సోమవారం 60మందికి రూ.29లక్షల 59వేల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల సంక్షేమానికి దేశంలో ఎక్కడాలేని పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. అనారోగ్యం ఇతర కారణాలతో ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స చేయించుకునే పేదలను సీఎం సహాయనిధితో అన్నివిధాలా ఆదుకుంటున్నట్లు తెలిపారు.
రైతుల అభ్యున్నతికి రైతుబంధు, వ్యవసాయానికి నిరంతర విద్యుత్ అందిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక కొందరు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారన్నారు. వారికి ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ రెహమాన్, ఎంపీపీ సుధాశ్రీ, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు అల్లావుద్దీన్, కౌన్సిలర్లు కిశోర్, రాంలక్ష్మణ్, ప్రవీణ్‌కుమార్, చిన్నా తదితరులు పాల్గొన్నారు.