కల్వకుర్తి, నవంబర్ 10 : తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని నాగర్‌కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు అన్నారు. మన ఊరు- మన బడి పథకంలో భాగంగా ప్రభుత్వం కేటాయించిన రూ.69.23 లక్షలు, సీఎస్ఆర్ నుంచి మంజూరైన రూ.కోటితో కల్వకుర్తి మండలం గుండూర్ గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలల్లో నూతన భవన నిర్మాణాలకు స్థానిక ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎ మ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి ఎంపీ భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ రాములు మాట్లాడుతూ తాను పుట్టి పెరిగిన గుం డూర్ గ్రామాభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని చె ప్పారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే లక్ష్యంతో మన ఊరు- మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. విద్యతోనే సంపూర్ణ వికాసం వస్తుందన్నారు.
అనంతరం ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ మాట్లాడుతూ గుండూర్ పాఠశాల నిర్మాణానికి తన నిధుల నుంచి రూ. 25 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ కశిరెడ్డి మాట్లాడుతూ పేద విద్యార్థుల విద్యాభ్యాసానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్న క్రమంలో, విద్యాభిమానులు తమ వంతుగా చేయూతనందించాలని పిలుపునిచ్చారు. గుండూర్ పాఠశాల అభివృద్ధికి తన ఫండ్ నుం చి రూ.20 లక్షలు ఇస్తానన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మనూచౌదరి, జెడ్పీటీసీ విజితారెడ్డి, ఎంపీపీ మనోహర, కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, పీఏసీసీఎస్ చైర్మన్ జనార్దన్‌రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ సూర్యప్రకాశ్‌రావు, మనోహర్‌రెడ్డి, సర్పంచ్ కిష్టారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు చెన్నకేశవులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.