నాగర్‌కర్నూల్, నవంబర్ 10: : జిల్లాలోని నిరుద్యోగ యువత, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల ఉపాధికి ఆసరా అయ్యేందుకు చేపట్టిన ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్-పీఎంఈజీపీ) ద్వారా ఉపాధి పొందేందుకు దరఖాస్తులు చేసుకోవాలని బీ.సీ, గిరిజన, మైనార్టీ, సంక్షేమ శాఖల అధికారి అనిల్‌ప్రకాశ్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని ప్రజావాణి సమావేశ మందిరంలో ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ రుణాలపై అవగాహన కార్యక్రమాన్ని లీడ్ బ్యాంకు, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల స్థాపనకోసం 18 ఏండ్లు దాటినవారికి తయారీ రంగంలో రూ. 25 లక్షలు, వివిధ సేవారంగంలో రూ.10 లక్షల చొప్పున పీఎంఈజీపీ పథకం కింద బ్యాంకుల ద్వారా రుణసాయం అందుతుందన్నారు. దీనికింద జనరల్ కేటగిరీ వారు ప్రాజెక్టు వ్యయంలో 10 శాతం, ఎస్సీ,ఎస్టీ, బీ.సీ, మైనార్టీ, మహిళా, మాజీ సైనికుల, దివ్యాంగులకు 5శాతం తమ వాటాగా చెల్లించాలన్నారు.
పట్టణ ప్రాంతాల్లోని జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 15 శాతం, ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులకు 25 శాతం రాయితీని ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ ఇస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో జనరల్ కేటగిరీవారికి 25 శాతం, ప్రత్యేక కేటగిరి వారికి 35 శాతం రాయితీ ఇస్తారని తెలిపారు. జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు దీనికి అనుగుణంగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. జిల్లా పరిశ్రమల అధికారి గ్రామీణ ప్రాంతాలవారికి జనరల్ 10 శాతం, 15 శాతం, 25 శాతం స్పెషల్ 5 శాతం, 25 శాతం, 35 శాతం పీఎంఈజీసీ కింద రూ.9.5 లక్షల నుంచి రూ.23.75 లక్షల రుణం లభిస్తుందన్నారు. అయితే తయారీ రంగానికి చెందిన ప్రాజెక్టు గరిష్ట పరిమితం రూ.25 లక్షలుకాగా, సర్వీసు రంగానికి చెందిన వ్యాపారులకు రూ.10 లక్షలుగా ఉండాలన్నారు.
సర్వీసు లేదా బిజినెస్ రంగమైతే రూ. 5 లక్షలకుపైగా కాస్ట్ ఉండాలని, స్వయం ఉపాధి గ్రూపులు సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్టు, 1860 కింద రిజిస్టర్ అయిన సంస్థలు ప్రొడక్షన్ కోఆపరేటీవ్ సంస్థలు ఛారిటబుట్ ట్రస్టులు కావాల్సిన డాక్యుమెంట్లు, ఆధార్‌కార్డు, ప్రాజెక్టు రిపోర్టు, అవసరమైతే స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్ రూరల్ ఏరియా సర్టిఫికెట్, ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్, ఈడీపీ సర్టిఫికెట్, ఆథరైజేషన్ లెటర్ ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా పీఎంఈజీపీను ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంకు మేనేజర్ కౌశల్కిశోర్పాండే, ఉమ్మడి జిల్లా ఖాదీ ఇండస్ట్రీస్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.