గద్వాల, నవంబర్ 8: గద్వాలలో గల్లీ లీడర్ల గలీజ్ దందాతో గృహిణులు, యువతులు ఆందోళన చెందుతున్నారు. న్యూడ్ కాల్స్ పేరుతో మహిళలను చేరదీసి వారి వ్యక్తిగత భద్రతకు సంబంధించిన సమాచారం సేకరించి వారి పరువును బజారుకు ఈడ్చారు. వారికి చేయూతనిచ్చి మనోధైర్యం చెప్పాల్సిన అధికారులు, గల్లీ లీడర్లు వత్తాసు పలికి వారిని మరింత మనోవేదనకు గురిచేస్తున్నారు.
గలీజ్ దందాకు ఓ పార్టీకి చెందిన నేతలు మద్దతుగా నిలవడంతో వారి చేష్టలకు అద్దు అదుపు లేకుండా పోయింది. ముగ్గురు మధ్య నెలకొన్న విభేదాల కారణంగా గద్వాల పరువు బజారుకు ఈడ్చారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పే వారితో పాటు వార్డుల్లో ప్రజల చేతుల్లో ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన వారు కూడా దందాలో భాగస్వామ్యం ఉండడంతో ఇటువంటి వారిని మేము ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్నామా అని మహిళలు మదన పడుతున్నారు. ఇలాంటి విషయాలు జరిగిన ప్రతి సారి ఖాకీలకు అవినీతి మరకలు అంటుతున్నాయి.జిల్లాలో ఖాకీ, ఖద్దరు ఒకటి కావడంతో వారు చేస్తున్న చేష్టలు ఎవరూ పట్టించు కోవడం లేదు.
కొన్ని నెలల కిందట మల్దకల్ మండలానికి చెందిన ఓ నేత మహిళపై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా ఇదేమని ప్రశ్నించిన ఆమె భర్తపై దాడి చేశారు. అయిన అతడిపై ఇప్పటి వరకు చర్యలు లేవు. ఇప్పుడు కూడా అసలు సూత్రదారులను పక్కకు పెట్టి అందులో భాగస్వామ్యులైన కొందరిని మాత్రమే అరెస్ట్ చేస్తున్నారని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇందులో ఓ ఆధికారికి భారీగా నజరానా ముట్టడంతో అనుకున్న స్థాయిలో విచారణ జరగడం లేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
పోలీసులకు అవినీతి మరకలు
నడిగడ్డ పోలీసులు కొన్ని వివాదాల్లో తలదూర్చుతూ అవినీతి మరకలు అంటించుకుంటున్నారని తెలుస్తుంది. ఈమధ్య కాలంలో అదనపు ఎస్పీ స్థాయి అధికారి మునుగోడులో ఓ పార్టీకి చెందిన వ్యక్తులకు సంబంధించి డబ్బులు పంపిణీ చేశాడనే విషయంలో అతడిని హెడ్‌ఆఫీస్‌కు అటాచ్ చేశారు. న్యూడ్‌కాల్ విచారణ సరిగా చేయలేదనే ఆరోపణలతో పట్టణ ఎస్సైని నాగర్‌కర్నూల్‌కు బదిలీ చేశారు.
ఈ అధికారికి న్యూడ్‌కాల్ వ్యవహారంలో అరెస్ట్ అయిన వినోద్‌తో లావాదేవీలు ఉన్నట్లు ఆరోపణలు పట్టణంలో గుప్పుమనడంతో అతడిని బదిలీ చేసినట్లు తెలిసింది. వీరితో పాటు గతంలో ఇక్కడ పని చేసిన పోలీస్ ధికారులు అవినీతి మరకలు అంటించుకొని బదిలీపై వెళ్లడం, సస్పెండ్ అయ్యాడు. గతంలో సీఐగా పని చేసిన వ్యక్తి ఓ ప్రేమ జంట వ్యవహారంలో జోక్యం చేసుకోవడంతో అతడిని సస్పెండ్ చేశారు. గతంలో మల్దకల్ ఎస్సైగా పనిచేసిన అధికారి అమ్మాయి ప్రేమ విషయంలో సస్పెండ్ అయ్యాడు. అలాగే గతంలో గట్టు ఎస్సైగా పనిచేసిన అధికారి ఇసుక,మట్టి దందా వ్యవహారంలో ఇతరులతో మాట్లాడుతూ ఫోన్ రికార్డింగ్‌లో దొరికిపోయారు.
గతంలో పని చేసిన ఉండవెల్లి ఎస్సై ఇసుక వ్యవహారాల్లో తలదూర్చడంతో పాటు ఓ పాత్రికేయుడిని ఇసుక మాఫీయాతో దాడిచేయించాడు. బియ్యం కేసు వ్యవహారంలో ఓ సీఐ సస్పెండ్ అయ్యారు. గద్వాల రూరల్ ఎస్సై ఎస్సీ,ఎస్టీ కేసు వివాదంలో బదిలీ చేశారు. ఇలా గతంలో పనిచేసిన కేటీదొడ్డి, ధరూర్,అయిజ ఎస్సైలపై కూడా ఆరోపణలు రావడంతో వారిని బదిలీ చేశారు. ఇలా జిల్లా పోలీసులు అనవసరపు వివాదాల్లో తలదూర్చుతూ మరకలు అంటించుకోవడంతో పాటు ఆ శాఖకు మచ్చతెస్తున్నారు. ఏది ఏమైనా ప్రజల మాన, ప్రాణాలకు భద్రత కల్పించాల్సిన పోలీసులు ఆరోపణలు ఎదుర్కొంటుండంతో ప్రజలు పోలీసులకు సమస్యలు చెప్పు కోవాలంటేనే భయపడుతున్నారు.
విచారణ కొనసాగేనా…
గద్వాల అర్బన్, నవంబర్ 8: కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న సెమీ న్యూడ్ ఫొటో, వీడియో కేసు విచారణ రోజురోజుకూ మలుపు తిరుగుతున్నది. ఈ వ్యవహారంలో పోలీస్ యంత్రాంగం అసలు నిందితులను పక్కకు పెట్టి అమాయకులను ఇరికించడంపై ప్రజల నుంచి సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారానికి సంబంధం లేని పోలీస్ అధికారిని తప్పించడం మరో చర్చనీయాంశం. పట్టణానికి చెందిన ఓ ముఖ్య నాయకుడు తన అనుచరులను కాపాడుకునేందుకు ఓ పోలీస్ అధికారిని రహస్యంగా కలిసినట్లు తెలిసింది. ఈమేరకు ఇద్దరి మధ్య డబ్బుల ఒప్పందం కుదిరినట్లు విశ్వసనీయ సమాచారం. న్యాయవాది ఫిర్యాదు మేరకు రెండ్రోజుల్లో సిట్ బృందాన్ని జిల్లాకు పంపించేందుకు రాష్ట్ర పోలీస్ అధికారులు సిద్ధమైనట్లు సమాచారం.