మహబూబ్‌నగర్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ముఖ్యమంత్రి చొరవతో తెలంగాణ పర్యాటక రంగంలో దూసుకుపోతున్నదని, అనేక పర్యాటక ప్రదేశాలు భూతల స్వర్గాన్ని తలపిస్తున్నాయని పర్యాటక, ఆబ్కారీ శాఖ మంత్రి డా.వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మంగళవారం లండన్ వేదికగా ప్రపంచ పర్యాటక మార్ట్ (డబ్ల్యూటీఎం)లో వివిధ దేశాల పర్యాటక రంగంపై ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.
తెలంగాణ నుంచి ప్రత్యేకంగా స్టాల్‌ను ఏర్పాటు చేసి ఇక్కడి పర్యాటక ప్రదేశాలను ఫొటోల రూపంలో విదేశీ ప్రతినిధులకు వివరిస్తున్నారు. ఈస్టాల్ను తెలంగాణ పర్యాటక శాఖ ఏర్పాటు చేయగా..ఇక్కడి నుంచి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ నేతృత్వంలో అధికారుల బృందం లండన్ వెళ్లింది. మన పర్యాటక ప్రదేశాలను చూసి ముగ్దులవుతున్న విదేశీ ప్రతినిధులను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఈసందర్భంగా లండన్ నుంచి ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు.
ప్రపంచ పర్యాటకులకు తెలంగాణ భూతల స్వర్గధామంగా విరాజిల్లుతుందని ఆకాంక్షించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో పర్యాటక రంగంల ముందుకు దూసుకుపోతుందన్నారు. రామప్ప గుడికి యునెస్కో గుర్తింపు రావడం, పోచంపల్లికి ప్రపంచ పర్యాటక గ్రామంగా ఎంపికయిందన్నారు. కొవిడ్ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా పర్యాటక రంగం అన్ని దేశాలకు ఆదాయ వనరుగా మారిందని, అందమైన ప్రదేశాలను చూసేందుకు పర్యాటకులు ఆసక్తి చూపిస్తున్నారన్నారు. అలాంటి పర్యాటకులకు తెలంగాణలో అనేక ప్రదేశాలు ఉన్నాయని ప్రతినిధులకు మంత్రి బృందం వివరించింది.
ఈమేరకు రాష్ట్ర సమగ్ర సమాచారాన్ని ఉచితంగా అందిస్తున్నారు. రామప్ప దేవాలయం, గొల్కొండ కోట, చార్మినార్, కుతుబ్షాహి టోంబ్స్, ఆసియాలోనే అతిపెద్ద బుద్ధవనం, యాదాద్రి టెంపుల్, మన్యంకొండ దేవస్థానం, వెయ్యిస్తంభాల గుడి, సమ్మక్క సారాలమ్మ, కేసీఆర్ అర్బన్ ఏకో పార్క్, కాళేశ్వరం ప్రాజెక్టు, వరంగల్ కోట చిత్రాలను వరల్డ్ టూరిజం మార్ట్‌లో ప్రదర్శిస్తున్నామని మంత్రి తెలిపారు. అద్భుతమైన ప్రదేశాలతోపాటు చరిత్ర, బతుకమ్మ లాంటి తెలంగాణ వారసత్వ సంపదలను ప్రపంచ దేశాల పర్యాటకులకు వివరిస్తున్నామన్నారు.
భారతావనికి తలమానికమైన కోహినూర్ వజ్రం గూర్చి సైతం చర్చిస్తున్నట్లు వెల్లడించారు. సమావేశంలో పాల్గొన్న బ్రిటీష్ ట్రావెల్ ఏజెంట్స్ ప్రతినిధులను తెలంగాణను సందర్శించి, పర్యాటక అభివృద్ధిని ప్రత్యక్షంగా చూడాలని మంత్రి ఆహ్వానించారు. కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ కార్యదర్శి అరవింద్‌సింగ్, తెలంగాణ పర్యాటక శాఖ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త, పర్యాటక శాఖాభివృద్ధి ఎండీ మనోహర్, అసిస్టెంట్ డైరక్టర్ మహేశ్, అసోసియేషన్ ఆఫ్ బ్రిటీష్ ట్రావెల్ ఏజెంట్స్ డైరెక్టర్ సుషాన్ధీర్, పాల్గొన్నారు.