శ్రీశైలం, నవంబర్ 7 : శ్రీశైల మహా క్షేత్రంలో కార్తీక పౌర్ణమి సంబురాలు వైభవంగా జరుగుతున్నాయి. రెం డో సోమవారం తెల్లవారుజాము నుంచి వివిధ ప్రాం తాల యాత్రికులతో క్షేత్ర పురవీధులు కిటకిటలాడాయి. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి కృష్ణమ్మకు దీప దానాలు చీరసారెలను సమర్పించుకున్నారు. శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్ల ఉభయ దేవాలయాల్లో అలంకార దర్శనాలు మాత్రమే కల్పించినప్పటికీ సుమారు మూడు గంటలకుపైగా దర్శన సమయం పట్టింది. క్షేత్రపరిధిలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటం తో యాత్రికులు కూడా సహకరించాలని ఈవో లవన్న కోరారు. పౌర్ణమి సందర్బంగా వచ్చిన యాత్రికుల ఆలయంలో జరిగే ప్రత్యేక కార్యక్రమాలను వీక్షించి స్వామివార్లను దర్శించుకునేందుకు క్యూలైన్లలో బారులు దీరా రు. భ్రమరాంబదేవి అమ్మవారికి లక్ష కుంకుమార్చన, ఊయలసేవ, పల్లకీసేవ కార్యక్రమాలను జరిపించారు.
కృష్ణమ్మ తల్లికి ఏకాదశ గంగాహారతులు..
కార్తీక పౌర్ణమి సందర్భంగా పాతాళగంగ వద్ద నెలకొల్పిన కృష్ణవేణి నదీమతల్లి విగ్రహానికి ప్రత్యేక పూజలను ఈవో లవన్న దంపతులు నిర్వహించారు. అనంతరం సంప్రదాయబదంగా కృష్టమ్మకు పసుపు కుంకు మ గాజులతో చీరసారెలను సమర్పించి గంగా హారతులను ఇచ్చారు. పౌర్ణమి ప్రదోషకాలంలో ఆలయ ప్రధా న వీధిలో గంగాధర మండపం వద్ద జ్వాలాతోరణం కార్యక్రమాన్ని నిర్వహించారు.
పుష్కరిణికి దశవిధ హారతులు, లక్ష దీపోత్సవం..
కార్తీక మాసంలో రెండో సోమవారం సందర్భంగా ఆలయ పుష్కరిణి వద్ద స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి దశవిధ హారతులు ఇచ్చారు. అనంతరం లక్షదీపోత్సవ కార్యక్రమాన్ని జరిపించారు.