మహబూబ్నగర్ మెట్టుగడ్డ, నవంబర్ 3 : తక్కువ బరువు ఉన్న పిల్లలపై అంగన్వాడీ టీచర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ వెంకట్రావు సూచించారు. జిల్లా కేంద్రంలోని మోనప్పగుట్ట ఒకటో అంగన్వాడీ కేంద్రాన్ని గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహారం పొందుతున్న పిల్లల వివరాలను తెలుసుకున్నారు. పిల్లల బరువు, వారికి పెడుతున్న ఆహారంపై ఆరా తీశారు. కేంద్రంలో సరైన వెలుతురు లేకపోవడం, శుభ్రత పాటించకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంగన్వాడీ కేంద్రాల నిర్వహణపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేంద్రం లో నమోదైన పిల్లలకు తప్పనిసరిగా పౌష్టికాహారం అందించాలని సూచించారు. ఎవరు రక్తహీనతతో బాధపడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పిల్లల బరువును క్రమం తప్పకుండా రికార్డుల్లో నమోదు చేయాలని, తక్కు వ బరువు ఉన్న పిల్లలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి పౌష్టికాహారం అందించాలని తెలిపారు. అలాగే గర్భిణులు, బాలింతల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలన్నారు. పోషకాలు కలిగిన ఆహార పదార్థాలపై అవగాహన కల్పించాలని సూచించారు. గర్భిణులు తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తలను తెలియజేయాలని ఆదేశించారు అంగన్వాడీ కేంద్రాల్లో రికార్డుల నిర్వహణ ప కడ్బందీగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.