
మరికల్, డిసెంబర్ 30 : ఆరుగాలం కష్టించి పంటలు పండించే రైతులను కేంద్రం నట్టేట ముంచుతున్నదని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ని అన్నదాతలు పండించిన వరి కొనుగోలు చేయకుండా బీజేపీ సర్కార్ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నదని విమర్శించారు. గురువారం మండల కేంద్రంతో పా టు పెద్దచింతకుంట గ్రామంలో రైతు వేదికలను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో రైతన్నలకు కన్నీటి కష్టాలు ఉండేవని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ హయాంలో రైతు సంక్షేమానికి కృషి చేస్తున్నదని చెప్పారు. రాష్ట్ర పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయని స్పష్టం చేశారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చిన రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ లేనిపోని విమర్శలు చేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం పొంతనలేని మాటలు మానుకోవాలని హితవు పలికారు. రైతులతో రాజకీయాలు తగవన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుపడాలంటే కర్షకులు ఆర్థికంగా ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్పర్సన్ గౌని సురేఖారెడ్డి, ఎంపీపీ శ్రీకళ, వైస్ ఎంపీపీ రవికుమార్, రైతుబంధు సమితి కోఆర్డినేటర్ సంపత్‌కుమార్, సర్పంచులు గోవర్ధన్, శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీలు సూజాత, గోపాల్, మంజుల, తీలేరు పీఏసీసీఎస్ చైర్మన్ రాజేందర్‌గౌడ్, డీఏవో జాన్‌సుధాకర్, ఏవో శివకుమార్, ఏఈవోలు పరశురాం, భరద్వాజ్, కోఆప్షన్ మండల సభ్యుడు మతీన్, నాయకులు రాజవర్ధన్‌రెడ్డి, చంద్రశేఖర్, హన్మిరెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.
బండెనక బండికట్టి..
‘బండెనక బండికట్టి.. పదహారు బండ్లు కట్టి’.. అనే సినీ గీతాన్ని తలపించేలా ఎడ్ల బండిపై ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి వచ్చారు. మండల కేంద్రంలో రైతు వేదిక భవనాన్ని ప్రారంభించేందుకు వచ్చిన ఎమ్మెల్యే మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా నుంచి రైతు వేదిక వరకు ఎడ్ల బండిపై వచ్చారు. తనకు రైతులపై ఉన్న చిత్తశుద్ధిని చాటారు.