నారాయణపేట టౌన్, నవంబర్ 1: తరగతి గదిలో ప్రతి విద్యార్థి సామర్థ్యాల సాధనకు ప్రణాళికలు రూపొందించి అమలు పరచాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. మంగళవారం పట్టణంలోని నైపుణ్య శిక్షణ కేంద్రంలో తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ప్రాజెక్టు అంకురంలో ఎంపిక చేసిన 50 ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రానున్న 40 రోజులలో నిర్ణీత లక్ష్యాలు ఏర్పాటు చేసుకొని, కనీస స్థాయిలు సాధించేలా కృషి చేయాలన్నారు. విధ్యార్థుల భాష, గణిత సామర్థ్యాల్లో మార్పు రావాలన్నారు. ఉపాధ్యాయులు యాక్షన్ ప్లాన్ రూపొందించుకొని దాని ఆధారంగా బోధన అందించాలని, రోజు వారి సామర్థ్యాల సాధన తర్వాతే పాఠ్యాంశాలు ప్రారంభించాలన్నారు. తొలిమెట్టు అమలులో ఉపాధ్యాయులు విద్యార్థుల పూర్తి బాధ్యతను తీసుకోవాలన్నారు.
క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాలి
సీడీపీవోలు, సూపర్వైజర్లు క్షేత్రస్థాయిలో అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేయాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. మంగళవారం పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో స్త్రీ శిశు సంక్షేమశాఖ అధికారులతో పిల్లలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో తక్కువ బరువున్న పిల్లలను గుర్తించి ఆకలి పరీక్ష చేయాలని, వైద్య పరీక్షల ద్వారా చిన్నారులకు పౌష్టికాహార లోపం, ఆరోగ్య సమస్యలు ఉన్నాయో తెలుసుకోవాలన్నారు. ప్రతి బుధవారం పిల్లల తల్లిదండ్రులతో, అంగన్వాడీ టీచర్లతో సమావేశం ఏర్పాటు చేసి జాగ్రత్తలు వివరించాలన్నారు. కేంద్రాల్లో పిల్లల హాజరు శాతం పెంచాలని, పరిశుభ్రతను పాటించాలన్నారు. ఇన్చార్జి డీఈవో గోవిందరాజులు, ఎంఐఎస్ కోఆర్డినేటర్ శ్రీనివాస్, శిశుసంక్షేమశాఖ అధికారి వేణుగోపాల్, చైల్డ్ లైన్ కుసుమ, తిరుపతయ్య, కవిత, ఎంఈవోలు, కాంప్లెక్స్ హెచ్ఎంలు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.