మహబూబ్‌నగర్‌టౌన్, నవంబర్ 1: మున్సిపాలిటీలో చేపట్టే అభివృద్ధి పనులపై అధికారులు దృష్టిపెట్టాలని అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్‌పవార్ అన్నారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో ఇరిగేషన్, పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులతో అభివృద్ధి పనులపై ఆయన సమీక్ష నిర్వహించారు. మహబూబ్‌నగర్‌లో ఇటీవల కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతా ల్లో రోడ్డు, డ్రైనేజీలు దెబ్బతిన్నాయని, నాలాలు అస్తవ్యస్తంగా అయినందున కాలనీలు ముంపునకు గురయ్యాయని తెలిపారు. చెరువుల నుంచి అలుగుల ద్వారా నీళ్లు సులభంగా వెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో మాట్లాడారు. మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో నాలాల క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం ఉన్న నాలాలను సర్వే చేయాలన్నారు. స్ట్రామ్ వాటర్ డ్రైనేజీలు, బరెల్‌గ్రౌండ్, హజ్‌హౌస్, క్రిస్టియన్ భవన్, స్లా టర్హౌస్, జంక్షన్ విస్తరణ పనులపై దృష్టి పెట్టాలన్నా రు. సీఎం కేసీఆర్‌తో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడి వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో పనులు చేపట్టేందుకు రూ.100కోట్లు మంజూరు చేయించారన్నారు. మున్సిపాలిటీలో అనుమతి లేకుండా నిర్మించిన కట్టడాలను తొలగించాలన్నారు. ఇకపై అధికారులు సీరియస్‌గా వ్యవహరించాలని, నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని పుర అధికారులను హెచ్చరించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్, ఆర్అండ్బీ ఈఈ స్వామి, డీఈ సంధ్య, ఇరిగేషన్ డీఈ మనోహర్, అధికారులు పాల్గొన్నారు.