మరికల్, నవంబర్ 1: కస్తూర్బా గాంధీ పాఠశాల నిర్మాణం పనులు ఇంకెన్నాళ్లు చేస్తారని, పనులు నత్తనడకన ఎందుకు జరుగుతున్నాయని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కాంట్రాక్టర్‌ను మార్చవలసి వస్తుందని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మండలంలో కలెక్టర్ సుడిగాలి పర్యటన చేశారు. మండలంలోని అప్పంపల్లి, మరికల్, కన్మనూర్, సప్పుల, జిన్నారం, మాధ్వార్, తీలేరు గ్రామాల్లో జరుగుతున్న మన ఊరు- మన బడి కార్యక్రమంలో చేపట్టిన పనులను పరిశీలించారు. పనులు ఇంకా పూర్తికాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. పస్పులలో నిర్మిస్తున్న కేజీబీవీ పనులు ఏడాది గడిచినా ఎందుకు ముందుకు సాగడం లేదని ప్రశ్నించారు.
అన్ని గ్రామాల్లోని నర్సరీల్లో పదివేల మొక్కలు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారని ప్రిన్సిపాల్ అనురాధను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 760మంది ఉన్నారని, పదో తరగతిలో 78మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు. తీలేరు పాఠశాలలో ఫ్లోరింగ్, విద్యుత్ వైర్ల బిగింపు పనులు వెంటనే పూర్తిచేయాలని కోరారు. కన్మనూర్‌లో ఇంగ్లిష్ టీచర్లు లేని విషయం గ్రామస్తులు, ఉపాధ్యాయులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రతి నర్సరీలో కచ్చితంగా రిజిస్టర్‌ను వినియోగించాలని తెలిపారు. కార్యక్రమంలో మరికల్, కన్మనూర్ సర్పంచులు కస్పే గోవర్ధన్, శరత్‌చంద్రారెడ్డి, డీపీవో మురళి, ఫారెస్ట్ అధికారి వీణావాని, నారాయణరావు, ఎంపీడీవో యశోదమ్మ, ఏపీవో చంద్రశేఖర్, ఎంపీవో బాలాజీ పాల్గొన్నారు.