పాలమూరు, నవంబర్ 1: జిల్లాకేంద్రంలోని పిల్లలమర్రిలో డిసెంబర్ 2,3వ తేదీల్లో నిర్వహించనున్న బాలోత్సవం వాల్‌పోస్టర్లను విడుదల చేశారు. మంగళవారం పట్టణంలోని రెడ్‌క్రాస్ భవనంలో సమావేశం నిర్వహించారు. అంతకుముందు బాలోత్సవం నిర్వహణ అధ్యక్షుడిగా బెక్కం జనార్దన్, ప్రధానకార్యదర్శిగా ప్రతిభను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహబూబ్‌నగర్ జిల్లాలో మొదటిసారిగా పిల్లల పండుగ నిర్వహిస్తున్నామని, కార్యక్రమానికి పిల్లలమర్రి బాలోత్సవం అని పేరు నిర్ణయించామని పేర్కొన్నారు. విద్యార్థుల్లో దేశభక్తి, సృజనాత్మకతను వెలికితీసేందుకు ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో పాల్గొనే విద్యార్థులను నాలుగు విభాగాలుగా విభజించమన్నారు. ఎల్కేజీ, యూకేజీ, 1వ తరగతి బేబీ జూనియర్స్, 2,3,4వ తరగతులు సబ్‌జూనియర్స్, 5,6,7వ తరగతులు జూనియర్స్, 8,9,10వ తరగతులు సీనియర్ గ్రూప్‌లుగా ఏర్పాటు చేశామని తెలిపారు. జానపద, శాస్త్రీయ నృత్యాలు, లఘునాటకాలు, విచిత్రవేషధారణలు, మిమిక్రీ, బతుకమ్మ తదితర సాంస్కృతిక విభాగంలో శతకపద్యాలు-భావం, స్వచ్ఛ తెలుగు, స్పెల్-బీ, మ్యాప్ పాయింటింగ్ ఉంటాయని తెలిపారు. బాలోత్సవం నిర్వహణ కమిటీ గౌరవ అధ్యక్షుడిగా బెక్కరి రాంరెడ్డిని ఎన్నుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ప్రభాకర్, ఉమాదేవి, గౌరవ సలహాదారులు జగపతిరావు, భాస్కరరెడ్డి, కార్యదర్శులు వీరాంజనేయులు, ప్రమోద్, ప్రహ్లాదరెడ్డి పాల్గొన్నారు.