లక్షలాది మంది భక్తుల రాకతో కాంచనగుహ పులకించింది. కురుమూర్తి రాయుడి ఉద్దాల ఉత్సవంతో జనసంద్రమైంది. పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి జాతరలో ప్రధాన ఘట్టమైన ఉద్దాల మహోత్సవం కనులపండువగా సాగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ర్టాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. పల్లమర్రిలో తయారు చేసిన చాటకు పూజలు నిర్వహించి ఊరేగింపుగా చిన్నవడ్డెమాన్లోని ఉద్దాల ఆలయానికి తీసుకొచ్చి.. ఎంతో నియమ నిష్టలతో తయారు చేసిన ఉద్దాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇసుకేస్తే రాలనంతగా జనాల మధ్య గోవింద నామస్మరణతో కురుమూర్తి ఆలయం వరకు ఉద్దాలను తాకేందుకు భక్తులు దారిపొడవునా క్యూ కట్టారు. ఉత్సవాలకు అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేయగా ఆర్టీసీ ఉమ్మడి జిల్లా నుంచి ప్రత్యేక బస్సులను నడిపింది.
మూసాపేట(చిన్నచింతకుంట)/దేవరకద్ర రూరల్, అక్టోబర్ 31 : తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి ప్రతి రూపమైన మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ కొండల్లోని కాంచనగుహలో స్వయంభూగా వెలసిన కురుమూర్తి స్వామి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రధాన ఘట్టమైన ఉద్దాల ఊరేగింపు లక్షలాది మంది భక్తుల మధ్య కనులపండువగా సాగింది. కలియుగ దైవమైన కురుమూర్తి స్వామి ఉద్దాలను తాకితే చాలు తమ కష్టాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఉద్దాల ఊరేగింపునకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ర్టాలకు నుంచి లక్షల మంది భక్తులు తరలివచ్చారు. మొదలు చిన్నచింతకుంట మండలంలోని పల్లమర్రిలో పవిత్రంగా తయారు చేసిన చాటకు పూజలు నిర్వహించి ఊరేగింపుగా చిన్న వడ్డెమాన్‌లోని ఉద్దాల ఆలయానికి తీసుకొస్తారు. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం దళితులు దీపావళి రోజు మొదలు పెట్టి 10 రోజులపాటు ఒంటి పూట భోజనంతో అతిపవిత్రంగా ఉంటూ నియమ నిష్టలతో ఆవు చర్మంతో తయారు చేసిన ఉద్దాలకు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి దంపతులు, జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సీతాదయాకర్‌రెడ్డి, శ్రీరాంభూపాల్, మధుసూదన్‌రెడ్డి, ప్రదీప్‌గౌడ్, సురేందర్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డితోపాటు వివిధ పార్టీల నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పూజలు నిర్వహించారు. అనంతరం చాటలో ఉద్దాలను ఉంచి ఊరేగింపును ప్రారంభించారు. ఇసుకేస్తే రాలనంతగా భక్తులు రావడంతో చిన్నవడ్డెమాన్ ఉద్దాల ఆలయం నుంచి మొదలుకొని వాగులో కురుమూర్తి ఆలయం వరకు భక్తులు ఉద్దాల దర్శనం, స్పర్శకోసం దారిపొడవునా క్యూ కట్టారు. భక్తుల ఉరుకులు, పరుగులు, కేరింతలు, ఆటలు, పాటలు, మహిళల పూనకాల మధ్య అత్యంత వైభవంగా ఊరేగింపు సాగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు ఆదేశానుసారం స్థానిక అధికారుల ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు పర్యవేక్షణ మధ్య కట్టుదిట్టమైన భధ్రత ఏర్పాట్లు చేశారు.
కురుమూర్తిస్వామి జాతర బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్థం ఉమ్మడి జిల్లా నుంచి కురుమూర్తిస్వామి ఆలయానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. కురుమూర్తి జాతర మైదానం నుంచి ప్రతి అర్ధగంటకు ఒక బస్సు ఉండేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రైవేటు వాహనాల్లో అధిక సంఖ్యలో తరలివెళ్లకుండా ఆర్టీసీ బస్సుల్లో సురక్షితంగా ఇంటికి చేరుకోవాలని అధికారులు కోరారు.
ఉద్దాల ఊరేగింపునకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారని ముందస్తుగానే జిల్లా అధికార యంత్రాంగం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. పోలీసులు, రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ, దేవాదాయ శాఖల సిబ్బందిని కేటాయించారు. ఎస్పీ, డీఎస్పీలతోపాటు, ఐదుగురు సీఐలు, 20 మంది ఎస్సైలు, ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుల్స్ కలిపి 52మంది, 152 మం ది కానిస్టేబుల్స్, 30మంది మహిళా పోలీసులను నియమించినట్లు తెలిపారు. జాతర ప్రాంగణంలో ప్రత్యేకించి వైద్య శిబి రాలు కూడా ఏర్పాటు చేశారు. జాతర సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలకు పార్కింగ్ ఏర్పాటు చేశారు.