మహబూబ్‌నగర్, అక్టోబ ర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. కృష్ణ, తుంగభద్ర నదులు, దుందుభీ, ఊ కచెట్టువాగు, మాగనూరు పెద్దవాగు, కందూరు వాగు, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నాగర్‌కర్నూల్ జిల్లాలోని అనేక వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దాదాపుగా అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేశారు. జూరాల, శ్రీశై లం, శ్రీరాంసాగర్, రామన్‌పాడు, సరళాసాగర్, కోయిల్‌సాగర్, సంగంబండ, నెట్టెంపాడు, సుంకేసు ల నిండుకుండలను తలపిస్తున్నాయి.
ఆర్డీఎస్ ఆనకట్టకు ఎన్నడూ లేనంత వరద వస్తున్నది. చెరువులు నిండగా.. కొన్ని అలుగులు పారుతున్నాయి. ఐదేండ్లలో ఈ సారి గరిష్ట వర్షపాతం నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో భూగర్భజలాలు పైపైకి వచ్చాయి. చాలా మండలాల్లోని బోర్లలో నీళ్లు ఉబికి వస్తున్నాయి. ప్రాజెక్టులు, చెరువులు, వాగు లు, వంకలు, కుంటలు, బోర్ల కింద ఈ ఏడాది ఉ మ్మడి జిల్లాలో 19 లక్షల ఎకరాలకుపైగా వివిధ ర కాల పంటలు సాగుచేస్తున్నారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో పంటలు పండుతున్నాయి. దీంతో ఎటు చూసినా పచ్చదనం పరుచుకున్నది. గతంలో ఎన్న డూ లేనంతగా సాగు చేస్తుండడం గమనార్హం. వర్షాధార పంటలు కూడా రికార్డు స్థాయిలో పండిస్తున్నా రు. వరి, పత్తి పంటలను అధికంగా సాగు చేస్తున్నా రు. గతేడాది రూ.16 వేల కోట్ల విలువైన పత్తి విక్రయాలు జరిగినట్లు సీసీఐ లెక్కలు వెల్లడిస్తున్నాయి.
రెండు నెలలుగా జలకళ..
ఉమ్మడి జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు నెలల నుంచి అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేశారు. నిరంతరంగా కృష్ణ, తుంగభద్ర నదులు, వా గులు, వంకలు ఏకధాటిగా ప్రవహించడం ఇదే ప్రప్రథమం. జూరాల ప్రాజెక్టులో 38 గేట్లు ఎత్తి సు మారు 1.80 లక్షలు, కోయిల్‌సాగర్ రెండు గేట్లతో 1,500 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. శ్రీరాంసాగర్, రామన్‌పాడు, సరళాసాగర్, సంగంబండ, నెట్టెంపాడు రిజర్వాయర్లు నిండుకుండలను తలపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో సుమారు 2 వేల చెరువులు నిండినట్లు అధికారులు చెబుతున్నారు. జూన్, జూలైలో సాధారణం కంటే తక్కువ వర్షాలు పడ్డాయి. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వా నలు దంచికొట్టడంతో ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. దుందుభీ వాగు 60 రోజులకు పై గా నిరంతరంగా ప్రవహించడం ఇదే మొదటిసారి. సరళాసాగర్ ప్రాజెక్టులో ఆటోమెటిక్ సైఫన్లు ఈ ఏ డాది పదిసార్లు తెరుచుకున్నాయి. బీమా, కల్వకుర్తి, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల కింద కాలువలకు నీటిని వదులుతుండడంతో రైతన్నలు సాగు చేస్తున్నారు.
గరిష్ఠ స్థాయిలో వర్షాలు..
ఈ ఏడాది ఉమ్మడి జిల్లాలో సాధారణానికి మిం చి రెండు రెట్లు గరిష్ఠ వర్షపాతం నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 631.5 మిల్లిమీటర్ల వర్షపాతానికిగానూ ఇప్పటివరకు 935.4 మి.మీ. నమోదైంది. సుమారు 72.6 శాతం మేర అధికంగా కురిసింది. నారాయణపేట జిల్లాలో 70.1, వనపర్తిలో 54.1, నాగర్‌కర్నూల్‌లో 48.2, జోగుళాంబ గద్వాలలో 43.1 శాతం అధిక వర్షపాతం నమోదైంది. అక్టోబర్‌లోనే సాధారణం కంటే రెట్టింపు వర్షపాతం నమోదైందంటే వానలు ఏ స్థాయిలో కురిశాయో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో దాదాపు 50 శాతం అధికంగా వర్షపాతం నమోదైనట్లు ఆయా జిల్లాల ప్రణాళిక శాఖాధికారులు చెబుతున్నారు. దీంతో ఎన్నడూ నీళ్లు పారని వంకలు కూడా పొంగిపొర్లుతున్నాయి.