నారాయణపేటటౌన్, అక్టోబర్ 19: దళితబంధుకు దరఖా స్తు చేసుకున్న గొర్రెలు, మేకలు, పౌల్ట్రీ యూనిట్లను ఈ నె లాఖరులోగా గ్రౌండింగ్ చేయాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. బుధవారం పట్టణంలోని కలెక్టరేట్ లో పశుసంవర్ధకశాఖ పనితీరుపై సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. జిల్లాలో లంపీస్కిన్ వ్యాక్సినేషన్ ప్రక్రియను వందశాతం పూర్తి చేయాలన్నారు. ఉపాధి నిమి త్తం అర్హులైన పేదలకు సబ్సిడీపై ఇస్తున్న మేలు జాతి కోళ్ల యూనిట్లను గ్రౌండింగ్ చేయాలన్నారు. జిల్లాలో మిల్క్ చిల్లింగ్ సెంటర్లు కనీసం రెండు ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. వీధికుక్కల నియంత్రణకు ఆపరేషన్ ద్వారా నియంత్రణ చర్యలు చేపట్టేలా ఎనిమల్ బర్త్ కంట్రోల్ ఏర్పాటు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి డాక్టర్ సురేఖ, డీఆర్డీవో గోపాల్‌నాయక్, వెటర్నరీ డాక్టర్లు పాల్గొన్నారు.
జిల్లాలో అర్హతగల ఉపాధ్యాయులు నవంబర్ 7వ తేదీలోగా ఎమ్మెల్సీ ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లాలోని ఉపాధ్యాయ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఓటరు నమోదు దరఖాస్తులను పరిశీలించేందుకు 180బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు ఓటరు నమోదుకు అర్హతగల ఉపాధ్యాయులందరూ ఫారం19 ద్వారా దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఇప్పటివరకు ఆన్లైన్లో 12దరఖాస్తులు వచ్చాయని, అర్హతగల ఉపాధ్యాయులందరూ ఓటు నమోదుకు ప్రాధాన్యత ఇచ్చి ఓటుహక్కును వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పద్మజారాణి, ఆర్డీవో రాంచందర్‌నాయక్, డీఈవో గోవిందరాజులు, తాసిల్దార్లు పాల్గొన్నారు.
ప్రతి గ్రామ పంచాయతీలో ఆయాశాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల వివరాలను తప్పులు లేకుండా గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శులకు, మండల స్థాయిలో ఎంపీవోలకు వివరాలు అందిస్తే వాటిని ఆన్లైన్లో నమోదు చేస్తారని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. బుధవారం కలెక్టరేట్లో లైన్ డిపార్ట్మెంట్ జిల్లా అధికారులు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులకు జాతీయ పంచాయతీ అవార్డుల వివరాల నమోదుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు అత్యధికంగా అవార్డులు వచ్చేలా అభివృద్ధి, సంక్షేమశాఖకు సంబంధించి లైన్ డిపార్ట్మెంట్ అధికారులు నివేదికలు ఇవ్వాలన్నారు. జాతీయ పంచాయతీ అవార్డులకు ఆన్లైన్లో అడుగుతున్న 9 థీమ్లలోని ఆయా ప్రశ్నలు, వాటికి సమాధానాలు ఏ విధంగా ఇవ్వాలో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, ఆర్డీవో రాంచందర్‌నాయక్, అధికారులు పాల్గొన్నారు.