శ్రీశైలం, అక్టోబర్ 18 : శ్రీశైలం ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. గంట గంటకూ నీటి మట్టం పెరుగుతున్నది. జలాశయం నిండుకుండలా మారింది. మంగళవారం సాయంత్రం జూరాల ప్రాజెక్టు గేట్ల నుంచి 1,66,624, విద్యుదుత్పత్తి నుంచి 27,212, సుంకేసుల నుంచి 66,176, హంద్రి నుంచి 117 క్యూసెక్కులు వదిలారు. దీంతో శ్రీశైలం జలాశయానికి 3,30,248 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. దీంతో పది గేట్లను ఎత్తి 2,79,370, కుడి, ఎడమ విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా 61,025 క్యూసెక్కులను సాగర్ రిజర్వాయర్‌కు విడుదల చేశారు. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలకుగానూ 213.88 టీఎంసీల నిల్వ ఉన్నది.
జూరాలలో..
అమరచింత, అక్టోబర్ 18 : జూరాల ప్రాజెక్టుకు వరద వస్తున్నది. మంగళవారం సాయంత్రం 2 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. దీంతో 41 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. బీమా లిఫ్ట్-2కు 750, విద్యుదుత్పత్తికి 27,212, ఎడమ కాల్వకు 820, కుడికాల్వకు 548 క్యూసెక్కులు వదిలారు. దీంతో ప్రాజెక్టు నుంచి మొత్తం 1,95,379 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైనట్లు అధికారులు తెలిపారు.
టీబీ డ్యాంలో..
కర్ణాటకలోని ఎగువన కురుస్తున్న వర్షాలకు టీబీ డ్యాంకు వరద స్థిరంగా వస్తున్నది. మంగళవా రం డ్యాంకు ఇన్‌ఫ్లో 35,048, అవుట్‌ఫ్లో 28,007 క్యూసెక్కులుగా నమోదైంది. 105.788 టీఎంసీల పూర్తిస్థాయి నీటి నిల్వకుగానూ ప్రస్తుతం 105.306 టీఎంసీల నిల్వ ఉన్నట్లు ఎస్ఈ శ్రీకాంత్‌రెడ్డి, సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు. ఆర్డీఎస్ ఆనకట్టకు 74,470 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా, 74 వేల క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది. ప్రధానకాల్వకు 470 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు ఏఈ శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం ఆనకట్టలో 12 అడుగుల మేర నీటి మట్టం ఉన్నది.