ఊట్కూర్, అక్టోబర్ 18 : నర్సరీల్లోని మొక్కల సంరక్షణపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డీఆర్డీవో గోపాల్‌నాయక్ సూచించారు. మండలంలోని ఊట్కూర్, పగిడిమర్రి, వల్లంపల్లి గ్రామాలను మంగళవారం సందర్శించి వన నర్సరీలను పరిశీలించారు. ప్రభుత్వం ప్రతి గ్రామాన్ని హరిత వనంగా మార్చేందుకు గ్రామానికో నర్సరీని ఏర్పాటు చేసిందన్నారు. నర్సరీల్లో మొక్కలు ఎండిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత సంబంధిత జీపీ కార్యదర్శులదేనని తెలిపారు. ఆయా నర్సరీల్లో అందుబాటులో ఉన్న మొక్కల వి వరాలను తెలుసుకున్నారు. ఎండిపోయిన మొక్కల స్థానం లో కొత్తగా విత్తనాలు నాటాలన్నారు. రోడ్ల పక్కన నాటిన మొక్కల చుట్టూ పిచ్చి మొక్కలను తొలగించాలని, వచ్చే ఏడాది తొమ్మిదో విడుత హరితహారంలో భాగంగా కొత్త నర్సరీల ఏర్పాటుకు మట్టి సేకరణ, విత్తనాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. నర్సరీ పెంపకంపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓబ్లాపూర్ వన సేవకుడిని విధుల నుంచి తొలగించాలని ఉపాధి ఏపీవో ఎల్లయ్యను ఆదేశించారు. కార్యక్రమంలో ఈసీ శ్రీనివాసులు, కార్యదర్శి సుమలత, టీఏలు తదితరులు పాల్గొన్నారు.